Share News

పరవాడ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:00 AM

పరవాడ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

పరవాడ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

16ఎకెపిరూరల్‌1: సస్పెన్షన్‌కు గురైన ఎస్‌ఐ మొయ్య రామారావు

- సివిల్‌ తగాదాల్లో జోక్యమే కారణం

- న్యాయం చేయాలని వేడుకున్న బాధితురాలిపై కేసు నమోదు

- కేసు ఎత్తివేతకు లంచం ఇవ్వాలని డిమాండ్‌

- లంచం ఇచ్చినా కేసు తొలగించకుండా బదిలీపై పరవాడ స్టేషన్‌కు..

- ఉన్నతాధికారులను ఆశ్రయించిన బాధితురాలి కుటుంబ సభ్యులు

- విచారణ జరిపి ఎస్‌ఐపై చర్యలు

అనకాపల్లి రూరల్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): పరవాడ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న మొయ్య రామారావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆయన గతంలో నర్సీపట్నం పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో గల నాతవరం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన సమయంలో భూ వివాదం(సివిల్‌ మేటర్‌)లో అందిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసు విచారణలో లోపాలు, బాధితులకు న్యాయం చేసేందుకు లంచం తీసుకోవడం నిరూపణ కావడం తదితర అభియోగాలపై అతనిని సస్పెండ్‌ చేస్తూ విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌జెట్టీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐ సస్పెన్షన్‌కు సంబంధించి వివరాలివి. మొయ్య రామారావు సార్వత్రిక ఎన్నికల అనంతరం సాధారణ బదిలీల్లో పరవాడ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఆయన బదిలీపై ఇక్కడకు రాక ముందు నర్సీపట్నం సబ్‌డివిజన్‌ పరిధిలోని నాతవరం ఎస్‌ఐగా పనిచేశారు. ఆ సమయంలో అదే మండలానికి చెందిన లాలం అమ్మాజీ భాగ్యలక్ష్మికి, వేరే వర్గానికి చెందిన వ్యక్తుల మధ్య తలెత్తిన భూ వివాదంలో అమ్మాజీ తనకు న్యాయం చేయాలని ఎస్‌ఐ రామారావును వేడుకున్నారు. భూమిపై అనుభవ హక్కు కింద రెవెన్యూ శాఖ అధికారులు జారీ చేసిన పొజిషన్‌ ధ్రువపత్రాన్ని కూడా ఆమె ఎస్‌ఐకు చూపించినప్పటికీ పట్టించుకోకుండా క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. రూ.10 లక్షలు లంచం ఇస్తేనే కేసు ఎత్తి వేస్తానని, లేకుంటే జైలుకు పంపుతాననిభయపెట్టారు. ఆమె ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కేసు ఎత్తివేయించుకునేందుకు రూ.10 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. దీనిలో భాగంగా దఫదఫాలుగా రూ.3 లక్షలు ఎస్‌ఐకి చెల్లించింది. అయినా ఆమెపై కేసును యథావిధిగా కొనసాగించారు. ఈలోగా బదిలీపై పరవాడ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేశారు. బాధిత మహిళ తన కేసు ఎత్తివేతకు మార్గాలు చూపాలని, సలహాలు ఇవ్వాలని ఎన్నిసార్లు వేడుకున్నప్పటికి ఎస్‌ఐ రామారావు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులను సంప్రతించి తనకు జరిగిన అన్యాయంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ ఆదేశించారు. వారం రోజుల క్రితం ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపారు. కేసు విచారణలో లోపాలు, అన్యాయంగా కేసు నమోదు చేయడం, బెదిరించి లంచం తీసుకోవడం, రికార్డులు సమగ్రంగా నిర్వహించలేదని నిర్ధారించారు. నివేదికను విశాఖపట్నం రేంజ్‌ డీఐజీకి అందజేశారు. దీంతో ఎస్‌ఐ రామారావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఉన్నతాధికారులకు తెలియకుండా హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 01:00 AM