గోడు పట్టదా!
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:15 AM
గత ప్రభుత్వ హయాంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌కు భూములు ఇచ్చిన రైతులను వీఎంఆర్డీఏ పూర్తిగా విస్మరించింది. భూములు సమీకరించి మూడేళ్లు దాటినా ఇంతవరకు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. అంతేకాదు ప్లాట్ల అభివృద్ధి పేరుతో ఫలసాయం అందించే జీడితోటలు తొలగించడంతో ఏటా వచ్చే ఆదాయం కోల్పోయామని రైతులు మండిపడుతున్నారు. డీపట్టా భూములకు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల మంజూరుకు గత ఏడాది వైసీపీ ప్రభుత్వం జీవో జారీచేసిందని, స్మార్ట్‌టౌన్‌షిప్‌కు భూములు ఇవ్వడంతో వాటిని కోల్పోయామని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎకరాకు 1,200 గజాలు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
స్మార్‌టౌన్‌షిప్‌నకు భూములిచ్చిన రైతుల గగ్గోలు
వీఎంఆర్‌డీఎ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం
సమీకరించిన భూముల్లో తోటలు తొలగింపు
జీడి పిక్కల ఫలసాయం కోల్పోయిన రైతులు
ఎకరాకు 1200 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
గత ప్రభుత్వ హయాంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌కు భూములు ఇచ్చిన రైతులను వీఎంఆర్డీఏ పూర్తిగా విస్మరించింది. భూములు సమీకరించి మూడేళ్లు దాటినా ఇంతవరకు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. అంతేకాదు ప్లాట్ల అభివృద్ధి పేరుతో ఫలసాయం అందించే జీడితోటలు తొలగించడంతో ఏటా వచ్చే ఆదాయం కోల్పోయామని రైతులు మండిపడుతున్నారు. డీపట్టా భూములకు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల మంజూరుకు గత ఏడాది వైసీపీ ప్రభుత్వం జీవో జారీచేసిందని, స్మార్ట్‌టౌన్‌షిప్‌కు భూములు ఇవ్వడంతో వాటిని కోల్పోయామని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎకరాకు 1,200 గజాలు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
నగరంలో మధ్యతరగతి వర్గాల వారికి తక్కువ ధరకు 150, 200, 250 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్లను విక్రయించాలని గత పాలకులు ప్రతిపాదించారు. ప్రైవేటు లేఅవుట్‌లలో ధరలు అధికంగా ఉంటాయని, మౌలికవసతుల కల్పన ఉండదని, ఆనందపురం మండలం రామవరం, గంగసాని అగ్రహారం, పాలవలసలో 2021 డిసెంబరు 27, 28న సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి 363 ఎకరాలను సమీకరించారు. ఇందులో డి పట్టాభూములు 306 ఎకరాలు, రైతుల ఆక్రమణలో ఉన్నవి 18 ఎకరాలు, గెడ్డలు, వాగులు, ఇతర ప్రభుత్వ భూములు సుమారు 40 ఎకరాలు న్నాయి. రామవరంలో 40 మంది రైతుల నుంచి 130 ఎకరాలు, గంగసాని అగ్రహారానికి చెందిన 70 మంది నుంచి 140 ఎకరాలు, పాలవలసలో 35 మంది నుంచి 90 ఎకరాలు సమీకరణకు రైతులు సమ్మతించారు. ఆ తరువాత రామవరంలో 20 ఎకరాలను ఇందులోంచి తప్పించారు. డీపట్టా ఇచ్చిన రైతుకు ఎకరాకు 900 గజాల అభివృద్ధిచేసిన ప్లాటు ఇస్తామని అధికారులు ప్రకటించారు. వీఎంఆర్‌డీఏ నిబంధనల మేరకు ఎకరాకు 2,600 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లు వస్తాయని, అందులో రైతులకు 900 గజాలు ఇవ్వగా 1,700 గజాలు మిగులుతుందన్నారు. వీఎంఆర్‌డీఏ స్థలాన్ని మూడు వర్గాలుగా విభజించి విక్రయించాలని ప్రతిపాదించి దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి లేఅవుట్‌లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు వంటి సదుపాయాలు కల్పించే బాధ్యత వీఎంఆర్‌డీఏదే. భూములిఇచ్చిన రైతులకు ఒక వైపుగా, మిగిలిన వైపు ప్లాట్లు విక్రయిస్తామని జిల్లా అధికారులు వివరించారు.
జీడితోటలు ధ్వంసం
ఇందులో భాగంగా సేకరించిన భూముల్లోని జీడితోటలను తొలగించారు. 2022 జనవరి తరువాత భూములను రెవెన్యూ అధికారులు వీఏంఆర్‌డీఏకు అప్పగించారు. రామవరం, గంగసాని అగ్రహారంలో జీడితోటల నుంచి రైతులు ఏటా జీడిపిక్కలు సేకరించేవారు. మూడు, నాలుగు ఎకరాల రైతులకు ఏడాదికి రెండున్నర నుంచి మూడు లక్షల ఆదాయం లభించేది. తోటలు తొలగించడంతో మూడేళ్లపాటు ఫలసాయం కోల్పోయారు. కాగా లేఅవుట్‌గా అభివృద్ధిచేసి ప్లాట్లుగా విభజించడంతో అధికారులు విఫలమయ్యారు. అప్పుడప్పుడు వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడమే మినహా ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రెండు నెలల క్రితం రామవరం, గంగసాని అగ్రహారం రైతులు జిల్లా యంత్రాంగాన్ని, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసి గోడు వినిపించారు. మూడేళ్లుగా తోటల ఫలసాయం కోల్పోయామన్నారు. ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు పొంది ఉంటే పూర్తి హక్కులు లభించేవన్నారు. అందువల్ల ఎకరాకు 1,200 గజాల ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించకపోతే భూములను తిరిగి స్వాధీనం చేసుకుని తోటలు పెంచుతామని స్పష్టం చేశారు.
మూడేళ్లుగా ఎదురుచూపులు
రామవరంలో మా తండ్రికి ఇచ్చిన రెండెకరాల డీపట్టా భూమిలో జీడి తోట వేశాం. ఏటా 20నుంచి 25 బస్తాల జీడిపిక్కలు లభించేవి. మూడేళ్లుగా ఆదాయం కోల్పోయాం. తోటలు తొలగించిన అధికారులు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తే విక్రయించే వీలుండేది. అది జరగకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది.
- అదరపు దేముడుబాబు, రామవరం