Share News

గ్రేటర్‌ టెండర్‌లపై నేతల కన్ను

ABN , Publish Date - Sep 05 , 2024 | 01:06 AM

చికెన్‌ వ్యర్థాల టెండర్లపై నేతల కన్నుపడింది. నగరంలో చికెన్‌ వ్యర్థాలను దుకాణాల నుంచి సేకరించి కాపులుప్పాడలోని యార్డుకు తరలించే కాంట్రాక్టులను తాము చెప్పిన వారికి దక్కేలా చూడాలంటూ జీవీఎంసీ అధికారులపై పలువురు ఒత్తిడి తెస్తున్నారు. అందుకు అవసరమైతే ఎంతో కొంత తమవారే ఇస్తారంటూ ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు.

గ్రేటర్‌ టెండర్‌లపై  నేతల కన్ను

చికెన్‌ వ్యర్థాల సేకరణ, డంపింగ్‌ యార్డుకు

తరలింపు కోసం టెండర్లు పిలిచిన జీవీఎంసీ

ఎనిమిది జోన్లుగా విభజన

మొత్తం రూ.1.57 కోట్ల అంచనా

ఆ కాంట్రాక్టు తాము చెప్పిన వారికి ఇవ్వాలంటూ

అధికారులపై కూటమి నేతల ఒత్తిడి

చికెన్‌ వ్యర్థాలను యార్డుకు తరలించకుండా

చేపల చెరువుల పెంపకందారులకు విక్రయిస్తున్న కాంట్రాక్టర్లు

బాగా గిట్టుబాటు అవుతుండడంతో

టెండర్‌లకు పెరిగిన పోటీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

చికెన్‌ వ్యర్థాల టెండర్లపై నేతల కన్నుపడింది. నగరంలో చికెన్‌ వ్యర్థాలను దుకాణాల నుంచి సేకరించి కాపులుప్పాడలోని యార్డుకు తరలించే కాంట్రాక్టులను తాము చెప్పిన వారికి దక్కేలా చూడాలంటూ జీవీఎంసీ అధికారులపై పలువురు ఒత్తిడి తెస్తున్నారు. అందుకు అవసరమైతే ఎంతో కొంత తమవారే ఇస్తారంటూ ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు.

నగర పరిధిలోని చికెన్‌/మటన్‌ దుకాణాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఆరు బయటపడేస్తే ప్రజలను రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. అందువల్ల జీవీఎంసీ అధికారులు ఆయా దుకాణాల నుంచి ప్రతిరోజూ వ్యర్థాలను వాహనాల ద్వారా సేకరించి కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించేవారు. అక్కడ శాస్త్రీయ విధానంలో వాటిని భూమిలో కప్పిపెట్టేవారు. ఇది జీవీఎంసీ అధికారులకు తలనొప్పిగా మారడంతో చికెన్‌ వ్యర్థాలను సేకరించే బాధ్యతను గత కొన్నేళ్లుగా ప్రైవేటు వ్యక్తులకు టెండర్‌ ద్వారా అప్పగిస్తూ వస్తోంది. జీవీఎంసీ పరిధిలో రెండేసి జోన్లను ఒక యూనిట్‌గా తీసుకుని ఆయా ప్రాంతాల్లో చికెన్‌ దుకాణాల నుంచి ప్రతిరోజూ వ్యర్థాలను సేకరించి, వారి సొంత వాహనాల్లో కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్ల నుంచి బాక్సు టెండర్లు పిలుస్తోంది. ఎవరు తక్కువ మొత్తానికి బిడ్‌ వేస్తారో వారికి కాంట్రాక్ట్‌ అప్పగించేది. అయితే నగర శివారు ప్రాంతాలతోపాటు అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో చేపల చెరువులు సాగు పెరగడంతో చికెన్‌ వ్యర్థాలకు డిమాండ్‌ పెరిగింది. చికెన్‌ వ్యర్థాలను ఉడకబెట్టి చేపలకు వేస్తే వేగంగా పెరుగుతాయని పెంపకందారులు భావిస్తుంటారు. ఇదే అదనుగా నగరంలో చికెన్‌ వ్యర్థాలను సేకరించి, కాపులుప్పాడలోని యార్డుకు తరలిస్తామని జీవీఎంసీ నుంచి కాంట్రాక్టు దక్కించుకున్నవారు వాటిని చేపల పెంపకందారులకు అమ్మడం మొదలుపెట్టారు. దీనివల్ల భారీగా ఆదాయం సమకూరుతుండడంతో చికెన్‌ వ్యర్థాల సేకరణకు పోటీ పెరిగిపోయింది. జీవీఎంసీ నుంచి బిల్లు తీసుకోవడం మానేసి, తిరిగి డబ్బులు కడతామనే పరిస్థితికి కాంట్రాక్టర్లు వచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుండగా గతంలో ఇచ్చిన కాంట్రాక్టు గడువు ముగియడంతో జీవీఎంసీ వ్యర్థాల సేకరణ, తరలింపునకు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో ఇటీవల రూ.1.57 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచింది. ప్రతి జోన్‌ను ఒక వర్క్‌గా విభజించింది. కాంట్రాక్టరే సొంతంగా వాహనంతోపాటు డ్రైవర్‌, వర్కర్లను సమకూర్చుకోవాలని, సేకరించిన వ్యర్థాలను కాపులుప్పాడలోని యార్డుకు మాత్రమే తరలించాలని, ప్రతిరోజూ కనీసం పది టన్నుల వ్యర్థాలను సేకరించాలని టెండర్‌లో నిబంధన విధించింది. అయినప్పటికీ టెండర్‌ దక్కించుకునేందుకు చాలామంది పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

కూటమి నేతలను ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు

వ్యర్థాల సేకరణ, తరలింపునకు జీవీఎంసీ పిలిచిన టెండర్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నవారంతా తమకు తెలిసిన కూటమి నేతలను ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా తమకు టెండర్‌ వచ్చేలా చూడాలంటూ కోరుతున్నారు. దీంతో కూటమి నేతలు జీవీఎంసీ అధికారులకు ఫోన్‌ చేసి చికెన్‌ వ్యర్థాలకు సంబంధించి తమ పరిధిలోని జోన్‌ టెండర్‌ తాను చెప్పిన వ్యక్తికి దక్కేలా చూడాలంటూ ఆదేశిస్తున్నారు. ఎవరైనా టెండర్‌ వేసినా వారిని ఏదోలా అనర్హులుగా తేల్చేయాలని సూచిస్తున్నారు. కూటమికి చెందిన ఒక నేతతోపాటు ముగ్గురు ప్రజా ప్రతినిధులు జీవీఎంసీ అధికారులకు ఫోన్‌ చేసి తమ వారికి టెండర్‌ వచ్చేలా చూడాలని ఆదేశించినట్టు తెలిసింది. అలాగే వైసీపీ నేతలు కొందరు తమతో బాగా పరిచయం కలిగిన కూటమి ప్రజా ప్రతినిధుల ద్వారా తమ అస్మదీయులకు టెండర్‌ ఇప్పించుకునేందుకు యత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా చికెన్‌ వ్యర్థాలతో పెరిగిన చేపలను తింటే క్యాన్సర్‌తోపాటు జీర్ణకోశ సంబంధిత రోగాలు చుట్టుముడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునైనా చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువులకు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Updated Date - Sep 05 , 2024 | 01:06 AM