Share News

జలపాతాలకు రాచబాట

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:48 PM

మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కటికి, తాటిగుడ జలపాతాలకు త్వరలో మంచిరోజులు రానున్నాయి. ఈ జలపాతానికి పర్యాటకులు సులువుగా వెళ్లేందుకు రహదారుల నిర్మాణానికి పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది.

జలపాతాలకు రాచబాట
శరవేగంగా జరుగుతున్న కటికి రోడ్డు పనులు

రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు

కటికి జలపాతానికి రూ.12.9 కోట్లు

తాటిగుడ జలపాతానికి రూ.6 కోట్ల నిధులు మంజూరు

ఊపందుకున్న పనులు

అనంతగిరి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కటికి, తాటిగుడ జలపాతాలకు త్వరలో మంచిరోజులు రానున్నాయి. ఈ జలపాతానికి పర్యాటకులు సులువుగా వెళ్లేందుకు రహదారుల నిర్మాణానికి పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖ నుంచి రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో ప్రస్తుతం రోడ్డు పనులు ఉపందుకున్నాయి.

వాస్తవానికి ఈ జలపాతాలకు వెళ్లాలంటే పర్యాటకులకు సాహసమే. సరైన రహదారి లేకపోవడం, విస్తరణకు నోచుకోకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించే క్రమంలో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. ప్రస్తుత పర్యాటక సీజన్‌లో ఈ రెండు జలపాతాలను అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది.

తాటిగుడ జలపాతానికి..

మండల కేంద్రాన్ని ఆనుకుని సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో తాటిగుడ జలపాతం ప్రకృతి అందాల మధ్యలో ఉరకలేస్తూ పారుతోంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి సరైన రహదారి లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. రహదారి నిర్మాణానికి గిరిజన సంక్షేమశాఖ నుంచి రూ.6 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తాటిగుడ వైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించి చదును చేస్తున్నారు. మంజూరు చేసిన రూ.6 కోట్లలో రూ.1.1 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. 40 అడుగుల మేర రహదారిని విస్తరించనున్నారు.

కటికి జలపాతానికి...

బొర్రా గేటువలస నుంచి సుమారు ఏడు కిలో మీటర్ల దూరంలో కటికి జలపాతం ఉంది. సుమారు 400 అడుగుల ఎత్తునుంచి జలపాతం రెండు కొండలపై జాలువారుతుండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్నానాలు చేసేందుకు వీలు ఉండడం, ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదాలు జరగకపోవడంతో ఇక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. గతంలో ప్రపంచ ర్యాపిల్లింగ్‌ పోటీలకు కటికి జలపాతం వేదికగా ఉండేది. బొర్రా గేటువలస నుంచి కటికి రైల్వేట్రాక్‌ వరకు రహదారి అభివృద్ధికి పంచాయతీరాజ్‌శాఖ రూ.12.9 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 40 అడుగుల విస్తరణతో రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Updated Date - Nov 13 , 2024 | 11:48 PM