Share News

ఒకరోజు ముందుగానే పింఛన్లు

ABN , Publish Date - Nov 30 , 2024 | 10:42 PM

జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగానే జరిగింది. తొలి రోజు శనివారం 94.23 శాతం లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్మును అందించారు.

ఒకరోజు ముందుగానే పింఛన్లు
పాడేరు మండలం కొత్తపాడేరులో పింఛన్‌ సొమ్ము అందిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

జిల్లాలో 94.23శాతం పంపిణీ

లబ్ధిదారులు 1,23,875 మందికిగానూ

1,16,732 మందికి అందజేత

పాల్గొన్న అధికారులు, కూటమి నేతలు

పాడేరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగానే జరిగింది. తొలి రోజు శనివారం 94.23 శాతం లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్మును అందించారు. జిల్లాలోని 22 మండలాల్లో 1,23,875 మంది పెన్షన్‌ లబ్ధిదారులకు రూ.51 కోట్ల 65లక్షల 4 వేలు విడుదల కాగా తొలి రోజు శనివారం రాత్రి 8 గంటలకు 1,16,732 మందికి రూ.48 కోట్ల 63 లక్షల 78 వేలు పెన్షన్ల సొమ్మును పంపిణీ చేశారు. ఇంకా 7,143 మందికి పెన్షన్‌ సొమ్ము అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 94.23 శాతంగా నమోదైంది. మిగిలిన లబ్ధిదారులకు ఆదివారం అందజేస్తామని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు మండలం కొత్తపాడేరులో శనివారం పలువురు లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్మును అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొర్రా విజయరాణి, టీడీపీ నేతలు కొట్టగుళ్లి సుబ్బారావు, డప్పోడి వెంకటరమణ, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి సల్లా రామకృష్ణ, సర్పంచ్‌ కొట్టగుళ్లి ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 10:42 PM