Share News

ప్రజల సమస్యలకు మండలస్థాయిలోనే పరిష్కారం

ABN , Publish Date - Nov 18 , 2024 | 11:54 PM

ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి పలు శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రజల సమస్యలకు మండలస్థాయిలోనే పరిష్కారం
అర్జీదారుల సమస్యను ఆలకిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో 324 అర్జీలు స్వీకరణ

అనకాపల్లి కలెక్టరేట్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి పలు శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో కలెక్టర్‌, జేసీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇక నుంచి ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను నిర్వహించి ప్రజల సమస్యలను కిందిస్థాయిలోనే పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. అన్ని శాఖల మండలస్థాయి అధికారులు పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. కాగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 324 అర్జీలు అందినట్టు కలెక్టరేట్‌ సిబ్బంది తెలిపారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ...

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ తుహిన్‌ సిన్హా అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారుల వినతులపై స్పందించి సత్వరమే వారికి న్యాయం చేయాలని కిందిస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, తదితర వాటికి సంబంధించి 40 అర్జీలు అందినట్టు ఎస్పీ కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దేవప్రసాద్‌, ఎస్‌ఐ వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 11:54 PM