పెసా దినోత్సవం రేపు
ABN , Publish Date - Dec 22 , 2024 | 10:54 PM
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 24న పెసా దినోత్సవాన్ని అన్ని పంచాయతీల్లో నిర్వహించనున్నట్టు డివిజన్ పంచాయతీ అధికారి పీఎస్.కుమార్ తెలిపారు. ఇందుకుగాను ప్రతి పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేలు మంజూరు చేసిందన్నారు.
వేడుకల నిర్వహణకు పంచాయతీకి రూ. 10 వేలు మంజూరు
డీఎల్‌పీవో పీఎస్.కుమార్
పాడేరురూరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 24న పెసా దినోత్సవాన్ని అన్ని పంచాయతీల్లో నిర్వహించనున్నట్టు డివిజన్ పంచాయతీ అధికారి పీఎస్.కుమార్ తెలిపారు. ఇందుకుగాను ప్రతి పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేలు మంజూరు చేసిందన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే ప్రజలు గ్రామసభల ద్వారా స్వయం పాలనకు భారత ప్రభుత్వం రూపొందించిన షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ విస్తరణ (పెసా) చట్టం 1996 డిసెంబరు 24వ తేదీన అమలులోకి వచ్చిందన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీలలో పెసా దినోత్సవాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రతీ పంచాయతీ సర్పంచ్, పంచాయతి కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి అధికారులు ప్రత్యేక గ్రామసభలను నిర్వహించాలన్నారు. ఈ సభలలో పెసా చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు గ్రామసభలను బలోపేతం, అటవీ ఉత్పత్తుల సేకరణ, ఖనిజ సంపద, రుణాలపై నియంత్రణ, భూ బదలాయింపు, మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై చర్చించాలన్నారు. ఈ సభలకు అటవీ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, న్యాయ శాఖల సిబ్బంది హాజరవుతారన్నారు.