Share News

చింతపల్లి డిగ్రీ కళాశాలలో పీజీ స్టడీ సెంటర్‌

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:13 AM

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) స్టడీ సెంటర్‌ను మంజూరు చేసింది. తొలి ఏడాదికిగానూ ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్‌ కోర్సును కేటాయించారు. ప్రథమ సంవత్సరానికి 30 సీట్లు మంజూరు చేశారు. డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది నుంచే విద్యాబోధన ప్రారంభించేందుకు విశ్వవిద్యాలయం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

చింతపల్లి డిగ్రీ కళాశాలలో పీజీ స్టడీ సెంటర్‌
పీజీ స్టడీ సెంటర్‌ మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల

తొలి ఏడాదికి ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌

30 సీట్లు కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఈ ఏడాది నుంచే విద్యా బోధన ప్రారంభం

విద్యార్థినీ, విద్యార్థులకు అందుబాటులో పోస్టుమెట్రిక్‌ వసతి గృహం

చింతపల్లి, సెప్టెంబరు 4:

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) స్టడీ సెంటర్‌ను మంజూరు చేసింది. తొలి ఏడాదికిగానూ ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్‌ కోర్సును కేటాయించారు. ప్రథమ సంవత్సరానికి 30 సీట్లు మంజూరు చేశారు. డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది నుంచే విద్యాబోధన ప్రారంభించేందుకు విశ్వవిద్యాలయం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గిరిజన ప్రాంతంలో ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు అందుబాటులోకి రావడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చింతపల్లిలో 15 ఏళ్ల క్రితం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 25 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో డిగ్రీ కళాశాల నిర్మించారు. తాజాగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సు, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ బోటనీ, బీఎస్సీ జుయాలజీ, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీఏ హిస్టరీ, బీఏ ఎకనామిక్స్‌ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులో ప్రథమ సంవత్సరానికి 480 సీట్లు కేటాయించగా, ఈ ఏడాది 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కళాశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో సుమారు 1,250మంది విద్యార్థినీ, విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చేసేందుకు మైదాన ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీట్లు లభించని విద్యార్థులు ప్రైవేటు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. దీంతో గిరిజన ప్రాంతంలో పీజీ స్టడీ సెంటర్‌ కేటాయించాలని ఈ ప్రాంత ఆదివాసీ విద్యార్థులు కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లోనూ పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయం అధికారులకు సూచనలు చేసింది. ఈ క్రమంలో జిల్లాలో కేవలం చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మాత్రమే ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్‌ కోర్సును మంజూరు చేసింది.

ఈ ఏడాది నుంచే ప్రవేశాలు

చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పించేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు వెబ్‌ ఆప్షన్‌లో చింతపల్లి స్టడీ సెంటర్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రథమ సంవత్సరానికి 30 సీట్లు కేటాయించారు. ఈ సీట్లు పొందేందుకు గిరిజన ప్రాంత విద్యార్థుల నుంచి మంచి పోటీ ఏర్పడే అవకాశం ఉన్నది. చింతపల్లి డిగ్రీ కళాశాల నుంచే ప్రతి ఏడాది 60 మంది విద్యార్థులు బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేసి బయటకొస్తున్నారు. అరకు, పాడేరు కళాశాలల్లో మరో 120 మంది విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకుంటున్నారు. ఈ కోర్సు చదివిన విద్యార్థులతో పాటు ఇతర కోర్సులు చదివిన విద్యార్థులు సైతం ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో చేరేందుకు పోటీ పడే అవకాశం ఉన్నది.

కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు

పీజీ ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థుల విద్యా బోధన, ప్రాక్టికల్స్‌ చేసేందుకు కంప్యూటర్‌ ల్యాబ్‌ కోసం రెండు గదులను కళాశాల యాజమాన్యం, అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ చింతపల్లి కళాశాలకు 20 కంప్యూటర్లు మంజూరు చేశారు. మరో 30 కంప్యూటర్లు కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కళాశాలలో గ్రంథాలయం కూడా అందుబాటులో ఉన్నది. ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో చేరిన విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించేందుకు కళాశాల యాజమాన్యం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకులు ఒకరు అందుబాటులో ఉన్నారు. మరో ఇద్దరు గెస్ట్‌ ఆచార్యులను పీజీ విద్యాబోధనకు నియమించుకునేందుకు ఉన్నత విద్యామండలి అనుమతించింది.

అందుబాటులో వసతి గృహాలు

చింతపల్లి పీజీ సెంటర్‌లో ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో చేరే విద్యార్థులకు పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. పాడేరు ఐటీడీఏ నిర్వహణలోనున్న బాలికలు, బాలుర వసతి గృహాల్లో పీజీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. పీజీలో చేరిన విద్యార్థులకు ఉచిత భోజన, వసతి కల్పిస్తారు. కళాశాల ఆవరణలోనే బాలికలు, బాలురకు వేర్వేరుగా వసతి గృహాలు ఉన్నాయి.

Updated Date - Sep 05 , 2024 | 12:13 AM