ఫార్మా పరిశ్రమలు మూత!
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:07 AM
ఫార్మా పరిశ్రమలు మూత!
ఐదు రోజులుగా నిలిచిన నీటి సరఫరా
అచ్యుతాపురం సెజ్‌కూ సమస్య
పంప్‌హౌస్ వద్ద మోటార్ల మొరాయింపు
నిర్వహణ గాలికి వదిలేయడంతోనే సమస్య
మరమ్మతులు చేయించామన్న ఏపీఐఐసీ జోనల్ మేనేజర్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పరవాడ రాంకీ ఫార్మా సిటీకి నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఫార్మాసిటీలో వందకు పైగా మందుల తయారీ కంపెనీలు ఉన్నాయి. వాటి రోజువారీ కార్యకలాపాలకు నీరు చాలా ముఖ్యం. ఫార్మాసిటీని రాంకీ యాజమాన్యం అభివృద్ధి (డెవలపర్) చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఐఐసీ మౌలిక వసతులు సమకూర్చింది. ఏలేరు కాలువ నుంచి నీటిని తీసుకొని తాడి వద్ద గల పంప్ హౌస్ ద్వారా ఫార్మా సిటీకి పంపిస్తారు. అక్కడ వారు వాటిని శుద్ధి చేసి కంపెనీలకు సరఫరా చేస్తారు. ఇదే పంప్‌హౌస్ నుంచి అచ్యుతాపురం ఆర్థిక మండలిలోని ఫార్మా కంపెనీలకు కూడా పంపుతున్నారు. ఫార్మాసిటీకి, అచ్యుతాపురం ఆర్థికమండలికి కలిపి రోజుకు 15 మిలియన్ లీటర్ల నీటిని అందిస్తున్నారు. ఇందుకోసం అత్యధిక సామర్థ్యం కలిగిన 750 హార్స్‌పవర్ మోటార్లు నాలుగు ఉన్నాయి. అవి పాడైతే మరమ్మతులు చేయడానికి టెక్నీషియన్లు కూడా అందుబాటులో ఉండరు. అందుకని వాటిని జాగ్రత్తగా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది జూన్‌లో ఒక మోటారు పాడైపోయింది. దానికి మరమ్మతులు చేయించడానికి ఎవరూ ముందుకురాలేదు. ఆ తరువాత ఒకదాని తరువాత మరొకటి అన్నీ మొరాయించాయి. దీంతో నెల 15వ తేదీ (శుక్రవారం) సాయంత్రానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విచిత్రం ఏమిటంటే...ఇక్కడ నీటిని ఏ రోజుకు ఆ రోజే సరఫరా చేస్తారు. ముందుచూపుతో కొంత నీటిని రిజర్వ్ చేసే సదుపాయం కూడా లేదు. దాంతో ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు మొదలయ్యాయి. కొందరు అరకొరగా ఉన్న నీటితో రెండు రోజులు సర్దుబాటు చేసుకొని ఆ తరువాత యూనిట్లు షట్‌డౌన్ చేశారు. పెద్ద కంపెనీలు డబ్బులు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నాయి.
నిర్వహణ లేకపోవడం వల్లే సమస్య
పంప్‌హౌస్‌లో వాడే మోటార్లు శక్తివంతమైనవి, అరుదైనవి. వాటికి ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఏపీఐఐసీ అధికారులు నిర్వహణ గాలికి వదిలేశారు. దాంతో అవి ఒకదాని తరువాత మరొకటి మొండికేశాయి. పరిశ్రమలు రావాలని పిలుపునిస్తున్న ప్రభుత్వాలు అత్యంత ముఖ్యమైన నీటిని కూడా రోజుల తరబడి ఇవ్వలేని పరిస్థితి వస్తే ఎలాగని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పునరుద్ధరించాం
హరిప్రసాద్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ
నీటి సమస్య తలెత్తిన మాట వాస్తవమే. ఆ మోటార్లకు మరమ్మతులు చేసేవారు అందుబాటులో లేరు. కాకినాడ నుంచి మనుషులను రప్పించి చేయించాల్సి వచ్చింది. సమస్య బుధవారం సాయంత్రానికి పరిష్కారమైంది. నీటి సరఫరా ప్రారంభించాం. రాత్రికి అచ్యుతాపురం యూనిట్లకు కూడా అందిస్తాం. కొత్త పంపుల నిర్మాణానికి రూ.70 లక్షలతో ప్రతిపాదనలు పెట్టాం.
రూ.కోట్ల ఆదాయం వస్తున్నా నిర్లక్ష్యం
ఓ.నరేశ్‌కుమార్, వైజాగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్
పారిశ్రామిక పార్కులకు నీటిని సరఫరా చేస్తూ ఏపీఐఐసీ కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తోంది. పంపు హౌస్‌లు, మోటార్ల నిర్వహణ గాలికి వదిలేస్తోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చింది. బ్యాకప్ మోటార్లు ఉంచుకోవలసిన అవసరం ఉంది. కానీ పట్టించుకోలేదు. ఇప్పటికైనా మేల్కొనాలి.