గిరిజన కార్పొరేషన్‌లో ముగ్గురికి చోటు
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:38 PM
గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చైర్మన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ను ఇటీవల నియమించిన కూటమి ప్రభుత్వం తాజాగా జీసీసీ డైరెక్టర్లుగా ముగ్గురు కూటమి నేతలకు అవకాశం కల్పించింది.
జీసీసీ డైరెక్టర్లుగా బొర్రా నాగరాజు, పాంగి రాజారావు, వంపూరు గంగులయ్య నియామకం
పాడేరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చైర్మన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ను ఇటీవల నియమించిన కూటమి ప్రభుత్వం తాజాగా జీసీసీ డైరెక్టర్లుగా ముగ్గురు కూటమి నేతలకు అవకాశం కల్పించింది. పాడేరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్స్ ఉపాధ్యక్షుడు బొర్రా నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు, జనసేన పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జి వంపూరు గంగులయ్యలను జీసీసీ డైరెక్టర్లుగా కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో బొర్రా నాగరాజు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండగా, జనసేన నేత గంగులయ్య పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే అరకులోయ నియోజకవర్గానికి చెందిన పాంగి రాజారావు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మన్యంలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల్లోని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలకు జీసీసీ డైరెక్టర్లుగా అవకాశం కల్పించడంపై కూటమి నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.