Share News

పోలీసుల పరధ్యానం

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:56 AM

నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు కొందరు విధినిర్వహణలో పరధ్యానంగా ఉంటున్నారు. కూడళ్లలో వాహనాల రాకపోకలు సక్రమంగా జరిగేలా చూడాల్సింది పోయి, రోడ్డుపక్కకు వెళ్లి సెల్‌ఫోన్‌ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.

పోలీసుల పరధ్యానం

కూడళ్ల వద్ద కానరాని ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు

సమీపానున్న చెట్టు కిందో, షాపు వద్దో కూర్చుని సెల్‌ఫోన్‌ తో కాలక్షేపం

హెల్మెట్‌ లేని వారిని ఫొటోలు తీయడంపైనే మరికొందరి దృష్టి

వాహనాలకు అడ్డంగా పరుగులు

ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో అలక్ష్యం

ఇష్టారాజ్యంగా వాహనాల రాకపోకలు

పెరుగుతున్న ప్రమాదాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు కొందరు విధినిర్వహణలో పరధ్యానంగా ఉంటున్నారు. కూడళ్లలో వాహనాల రాకపోకలు సక్రమంగా జరిగేలా చూడాల్సింది పోయి, రోడ్డుపక్కకు వెళ్లి సెల్‌ఫోన్‌ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపే వారిని సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయడంపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో సిగ్నల్‌తో పనిలేకుండా వాహనాల రాకపోకలు ఇష్టారాజ్యంగా సాగిపోతున్నాయి. దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నగరంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ సవ్యంగా సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్‌ విభాగంలో పనిచేసేవారు తమకు కేటాయించిన కూడలిలో ఉండి సిగ్నల్స్‌కు అనుగుణంగా వాహనాల రాకపోకలు జరిగేలా పర్యవేక్షించాలి. ఎవరైనా సిగ్నల్‌ జంపింగ్‌కు పాల్పడినట్టయితే వారి వాహనాలను ఫొటో తీసి ఈ-చలాన్‌ జారీ కోసం ఉన్నతాధికారులకు పంపించాలి. అయితే కొందరు హోంగార్డులు, కానిస్టేబుల్‌/హెడ్‌ కానిస్టేబుళ్లు బాధ్యతలను విస్మరించి సమీపంలో గల చెట్టు కింద లేదంటే దుకాణం వద్ద వెళ్లి కూర్చొని సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేసుకుంటున్నారు. తమ డ్యూటీ సమయం అయిపోగానే ఇంటికి వెళ్లిపోతున్నారు. మరికొందరు సిబ్బంది ఎవరు హెల్మెట్‌ లేని వారిని, ట్రిపుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వారిని గుర్తించడంపైనే దృష్టి పెడుతున్నారు. అలాంటివారు కనిపించగానే రోడ్డుకు అడ్డంగా వెళ్లి మరీ వారి ఫొటోలను తీస్తున్నారు. పోలీస్‌ యూనిఫారంలో ఉన్నాం కాబట్టి, వాళ్లే ఆగుతారనే భావనతో వాహనాలకు అడ్డంగా పరుగెత్తుతున్నారు.

కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సిబ్బంది కనిపించకపోవడంతో కొందరు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. రెడ్‌సిగ్నల్‌ పడినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలో ఉన్న కానిస్టేబుల్‌ వచ్చి హడావుడి చేసి...తర్వాత మళ్లీ యథావిధిగా చెట్టు కిందకు చేరుతున్నారు. దీనిపై ట్రాఫిక్‌ ఉన్నతాధికారులకు కొంతమంది ఫిర్యాదులు చేయడంతో కొద్దిరోజుల కిందట అన్ని జంక్షన్లను తనిఖీ చేసి, రోడ్డు మధ్యన నిలబడి విధులు నిర్వర్తించని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోసారి కూడలిలో కాకుండా దూరంగా చెట్ల కింద కూర్చొని సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నట్టు కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ సిబ్బంది తీరు మారకపోవడం విశేషం.

Updated Date - Oct 23 , 2024 | 12:56 AM