Share News

కొరపర్తి అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:32 PM

మండలంలోని కొరపర్తి గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని రెండు రోజుల క్రితం మండల అధికారులకు ఐటీడీఏ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 21న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆ గ్రామంలోని శిథిలమైన అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించిన నేపథ్యంలో దీనికి కదలిక వచ్చినట్టు తెలిసింది.

కొరపర్తి అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు
కొరపర్తి గ్రామాన్ని ఈ నెల 21న సందర్శించి అంగన్‌వాడీ భవన సమస్యను వింటున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదలిక

అనంతగిరి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొరపర్తి గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని రెండు రోజుల క్రితం మండల అధికారులకు ఐటీడీఏ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 21న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆ గ్రామంలోని శిథిలమైన అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించిన నేపథ్యంలో దీనికి కదలిక వచ్చినట్టు తెలిసింది.

మండలంలోని పినకోట పంచాయతీ బల్లగరువు గ్రామాన్ని ఈ నెల 21న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సందర్శించి రహదారుల పనులకు శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే. కాగా తిరుగు ప్రయాణంలో కొరపర్తి గ్రామం వద్ద గిరిజనులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామానికి వచ్చి సమస్యలను పరిశీలించాలని గిరిజన మహిళలు కోరారు. దీంతో ఆయన కారు దిగి వారితో పాటు గ్రామంలోకి వెళ్లారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ భవనం లేక అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని, దీంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. పాఠశాల, రోడ్లు, తదితర సమస్యలను ఆయనకు విన్నవించారు. వారి సమస్యలను డిప్యూటీ సీఎం ఓపికగా ఆలకించి సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం ఐటీడీఏ అధికారుల నుంచి మండల స్థాయి అధికారికి ఫోన్‌ వచ్చింది. కొరపర్తి అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. శిథిలమైన అంగన్‌వాడీ భవనం, అద్దె భవనంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం ఫొటోలతో పాటు పూర్తి సమాచారాన్ని ఇక్కడి అధికారులు ఐటీడీఏ అధికారులకు పంపారు. అంగన్‌వాడీ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎంకు ఐటీడీఏ అధికారులు పంపినట్టు సమాచారం. తమ గ్రామానికి ఉప ముఖ్యమంత్రి రావడం వల్ల మేలు జరుగుతుందని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:32 PM