ఆరో తరగతి, ఇంటర్ సీట్లు పెంపునకు ప్రతిపాదనలు
ABN , Publish Date - Jun 20 , 2024 | 11:25 PM
పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమోన్నత పాఠశాలల్లో 6వ తరగతి, గురుకుల కళాశాలల్లో ఇంటర్ సీట్లు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కొండలరావు అన్నారు.
అరకులోయ, జూన్ 20: పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమోన్నత పాఠశాలల్లో 6వ తరగతి, గురుకుల కళాశాలల్లో ఇంటర్ సీట్లు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కొండలరావు అన్నారు. గురువారం స్థానిక ఐటీడీఏ అతిథిగృహంలో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. ఆరో తరగతిలో చేరేందుకు అధికంగా విద్యార్థులు వస్తున్నారని, అదేవిధంగా గురుకుల కళాశాలలో ఇంటర్‌కు సీట్ల డిమాండ్ ఉన్నదన్నారు. మండలంలోని లోతేరు, గన్నెల బాల, బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలు, దొరగుడ, భట్టివలస, గొందివలస ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశామన్నారు. లోతేరు బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో 170 మంది విద్యార్థులకు గాను కేవలం 50 మంది మాత్రమే ఉన్నారని, శనివారం నాటికి 90 శాతం విద్యార్థుల హాజరు ఉండాలని హెచ్‌ఎం, టీచర్లను ఆదేశించామన్నారు. గన్నెల బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో 230 మంది బాలికలకు గాను 210 మంది ఉన్నారన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లల బుక్స్, బూట్లు, దుస్తుల కోసం మండల కేంద్రాలలోని స్టాకు పాయింట్లకు వెళుతున్నారన్నారు. త్వరితగతిన స్టాకును తీసుకొని తరగతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించామన్నారు. మరోమారు పాఠశాలల తనిఖీల్లో ఏ లోపం ఉన్నా సహించేది లేదని డీడీ కొండలరావు స్పష్టం చేశారు. ఆశ్రమోన్నత పాఠశాలు, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండాలన్నారు. టీచర్స్ సమయపాలన పాటించి, విధులకు హాజరు కావాలన్నారు. వసతిగృహాల్లో మెనూ పక్కాగా అమలు కావాలన్నారు. వసతిగృహాలకు ఆ విద్యాసంవత్సరంలో కార్పెట్లు, బ్లాంకెట్లు సరఫరా చేయనున్నట్టు డీడీ కొండలరావు చెప్పారు.