Share News

రంగురాళ్ల కోసం గుట్టుగా తవ్వకాలు

ABN , Publish Date - Jun 16 , 2024 | 12:25 AM

ఆరిలోవ అటవీ ప్రాంతంలో రంగురాళ్ల కోసం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుట్టుగా శుక్రవారం రాత్రి తవ్వకాలు జరిపినట్టు తెలిసింది. అటవీ సిబ్బంది కాపలా ఉన్నప్పటికీ తవ్వకాలు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.

రంగురాళ్ల కోసం గుట్టుగా తవ్వకాలు
ఆరిలోవ అటవీ ప్రాంతంలో రంగురాళ్ల కోసం తవ్విన గొయ్యి

- రూ.2 లక్షల విలువైన రాళ్లు లభ్యమైనట్టు జోరుగా ప్రచారం

- అటవీ సిబ్బంది కాపలా ఉన్నా అక్రమార్కులు బరి తెగించడంపై అనుమానాలు

గొలుగొండ, జూన్‌ 15: ఆరిలోవ అటవీ ప్రాంతంలో రంగురాళ్ల కోసం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుట్టుగా శుక్రవారం రాత్రి తవ్వకాలు జరిపినట్టు తెలిసింది. అటవీ సిబ్బంది కాపలా ఉన్నప్పటికీ తవ్వకాలు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.

మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో ధన్వంతరీ వనం ప్లాంటేషన్‌ వద్ద రంగురాళ్ల క్వారీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రంగురాళ్ల తవ్వకాలు జరిపినట్టు సమాచారం. సుమారు రెండు లక్షల రూపాయల విలువైన రంగురాళ్లు లభ్యమైనట్టు మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రంగురాళ్లను నర్సీపట్నంలో వ్యాపారులు విక్రయించినట్టు తెలిసింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రంగురాళ్ల తవ్వకాలపై కొందరు దృష్టి సారించారు. అయితే రాత్రి సమయంలో అటవీ సిబ్బంది ఆరిలోవ అటవీ ప్రాంతంలో కాపలా ఉన్నప్పటికీ రంగురాళ్ల తవ్వకాలు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తవ్వకాలు జరిగినట్టు చెబుతున్న ప్రాంతాన్ని శనివారం నర్సీపట్నం ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అటవీ ప్రాంతంలో గల మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని, ఎటువంటి తవ్వకాలు జరగలేదని విలేకరులకు ఆయన చెప్పారు. అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు జరగకుండా నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు.

Updated Date - Jun 16 , 2024 | 12:25 AM