జిల్లా స్థాయిలో రియల్ టైమ్ గవర్నెన్స్
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:35 AM
పరిపాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
కలెక్టరేట్‌లో సిద్ధమవుతున్న డీఆర్‌టీజీ భవనం
పర్యవేక్షణ అంతా అక్కడి నుంచే...
సీసీ కెమెరాలన్నీ అనుసంధానం
30 మంది కూర్చుని నిశితంగా పరిశీలించేలా ఏర్పాట్లు
నేరాలు, ప్రమాదాలు వంటివి చోటుచేసుకుంటే ఆయా ప్రాంతాల వారికి సమాచారం అందించేలా వ్యవస్థ
ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు?
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పరిపాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ-గవర్నెన్స్ అమలు చేస్తోంది. కొత్తగా వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ప్రతి జిల్లా కేంద్రంలో ‘డిస్ట్రిక్ట్ రియల్ టైమ్ గవర్నెన్స్’ (డీటీఆర్‌జీ) ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఒక భవనం నిర్మిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను దీనికి అనుసంధానం చేస్తారు.
డీటీఆర్‌జీలో కనీసం 30 మంది కూర్చుని జిల్లావ్యాప్తంగా అనుసంధానం చేసిన సీసీ టీవీ కెమెరాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తారు. ఏ ప్రాంతంలో ఏమి జరుగుతున్నదీ గమనిస్తారు. దీని ద్వారా నేరస్థుల సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ సెంటర్‌లో పోలీసులతో పాటు ఇతర శాఖల వారినీ ఉంచుతారు. నేరస్థులు, అనుమానితుల ఫేసియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు), గుంపులుగా చేరుతున్న జనాలు, నో పార్కింగ్ ఏరియాలో ఉల్లంఘనలు, తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేయడం, సిగ్నల్ జంపింగ్, పనికి రాని వస్తువులను రహదారుల పక్కన వదిలేయడం వంటివన్నీ నిశితంగా పరిశీలించి అక్కడి నుంచే ఆయా ప్రాంతాల వారికి సమాచారం అందిస్తారు. తక్షణ చర్యలు చేపట్టాల్సిన సందర్భాల్లో హెచ్చరికలు చేస్తారు. ఈ సెంటర్ల పనితీరు ఎలా ఉండాలనే దానిపై త్వరలోనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీ)ను సూచిస్తారు. ఈ కేంద్రాలకు రాష్ట్ర హెడ్ క్వార్టర్ నుంచి కూడా సమాచారం వస్తుంది.
విశాఖ జిల్లాలో జీవీఎంసీ, పోలీస్ కమిషనరేట్‌లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. స్మార్ట్ సిటీలో భాగంగా జీవీఎంసీ నగరంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన స్మార్ట్ పోల్స్, సీసీ టీవీ కెమెరాల ద్వారా ఫీడింగ్ తీసుకుంటోంది. అయితే అది కొన్ని పరిమిత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన స్మార్ట్ పోల్స్ నామమాత్రంగా మిగిలిపోయాయి. వాటి నిర్వహణ గాలికి వదిలేశారు. ఇక పోలీస్ విభాగం తరఫున ఏర్పాటుచేసిన సీసీ టీవీ కెమెరాల్లో చాలావరకు పనిచేయడం లేదు. గత ప్రభుత్వం వాటి నిర్వహణ పట్టించుకోలేదని, తాము అన్నింటినీ అందుబాటులోకి తెస్తామని హోం శాఖా మంత్రి అనిత ఇటీవల ప్రకటించారు. వాటి నుంచి అందే సమాచారాన్ని పోలీసులు వారి కేసుల దర్యాప్తునకు ఉపయోగించుకుంటారు. ఇప్పడు జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటయ్యే కేంద్రం ద్వారా సమగ్ర పరిశీలన చేస్తూ నేరాలు జరగకుండా, జరిగినప్పుడు వెంటనే అప్రమత్తం చేసేలా చర్యలు చేపడతారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు ఇది ఏప్రిల్ నుంచి పనిచేయాల్సి ఉంది. కలెక్టరేట్‌లో ఈ భవన నిర్మాణం ఇప్పటికే 70 శాతం పూర్తయింది.