నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
ABN , Publish Date - Dec 06 , 2024 | 01:31 AM
జిల్లాలో శుక్రవారం నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకూ రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు.
వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకూ నిర్వహణ
వినతులు ఆన్‌లైన్‌లో నమోదు
45 రోజుల్లోగా పరిష్కారమయ్యేలా చర్యలు
మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ రేపు
కలెక్టర్ హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో శుక్రవారం నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకూ రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు అధికారులు వెళ్లి సమస్యలను పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల ప్రధాన ఉద్దేశమన్నారు. 22-ఏ, యూఎల్‌సీ వంటి భూ వివాదాలతోపాటు ఇతర రెవెన్యూ అనుబంధ సమస్యలు ఈ సదస్సుల్లో పరిష్కరించుకోవచ్చునన్నారు. సదస్సుల్లో రెవెన్యూ, అటవీ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, రిజిస్ర్టేషన్, వక్ఫ్ అధికారులు అన్ని రికార్డులతో పాల్గొంటారన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులను ఆయా గ్రామాలకు వెళ్లి పరిష్కరిస్తామన్నారు. గతంలో కేటాయించిన ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేటు భూముల వివాదాలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలన్నారు. 22-ఏలో ఉన్న ప్రభుత్వ, జిరాయితీ భూములకు సంబంధించిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఫ్రీ హోల్డ్, 22-ఎ భూఆక్రమణ సమస్యలతో ప్రభావితమైన వారి నుంచి ముందస్తు సమాచారంతో వినతులు స్వీకరిస్తామన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన వినతులు రోజువారీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. సదస్సుల్లో వచ్చిన వినతులు 45 రోజుల వ్యవధిలో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.
మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ రేపు
జిల్లాలోని 595 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈనెల ఏడో తేదీన మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు తయారుచేసిన ఆహ్వాన పత్రాలను సంబంధిత హెచ్‌ఎం ద్వారా తల్లిదండ్రులకు పంపామన్నారు. మెరుగైన విద్యను అందించేందుకు తల్లిదండ్రుల సూచనలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిల్లల చదువు, క్రమశిక్షణ గురించి తల్లిదండ్రులకు వివరిస్తామన్నారు. అందువల్ల తల్లిదండ్రులు ఈ సమావేశాలకు హాజరుకావాలని కలెక్టర్ కోరారు. విలేకరుల సమావేశంలో డీఆర్వో భవానీశంకర్ పాల్గొన్నారు.