ఈపీడీసీఎల్‌లో రెవెన్యూ టార్గెట్స్
ABN , Publish Date - Mar 20 , 2024 | 01:10 AM
సంస్థ పరిధిలో ప్రతి నెలా పదో తేదీలోగా బిల్లింగ్ మొత్తం జరిగిపోయేలా ఏర్పాట్లు చేశారు.
నెలాఖరుకల్లా వంద శాతం వసూలు చేయాలని ఆదేశాలు
వాణిజ్య వినియోగదారుల చుట్టూ చక్కర్లు కొడుతున్న ఇంజనీర్లు
గడువుకు ముందే చెల్లించాలని వేడుకోలు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు’గా మారింది విద్యుత్ శాఖ ఇంజనీర్ల పరిస్థితి. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస ్థ(ఈపీడీసీఎల్) నెలాఖరుకు 100 శాతం బిల్లులను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని వసూలు చేయాల్సిన బాధ్యత ఇంజనీర్లకు అప్పగించింది. విద్యుత్ సరఫరా, కొత్త కనెక్షన్లు, ఫిర్యాదుల పరిష్కారం చూడాల్సిన అధికారులంతా ఇప్పుడు బిల్లులను సకాలంలో కట్టించే పనిలో పడాల్సి వచ్చింది. సంస్థ పనితీరు మెరుగుపరుచుకోవడానికి అమలు చేస్తున్న సరికొత్త నిబంధనల్లో వంద శాతం రెవెన్యూ వసూళ్లు కూడా చేర్చడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
సంస్థ పరిధిలో ప్రతి నెలా పదో తేదీలోగా బిల్లింగ్ మొత్తం జరిగిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఇంతకు ముందు ఇది 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగేది. బిల్లులు ఇవ్వడం ఆలస్యమైతే... వసూళ్లు కూడా ఆలస్యం అవుతాయని భావించి, ఎట్టి పరిస్థితుల్లోను పదో తేదీలోగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో 12వ తేదీ వరకు సమయం ఇస్తున్నారు. బిల్లు జారీ చేసిన తరువాత దానిని చెల్లించడానికి వినియోగదారులకు 15 రోజులు గడువు ఉంటుంది. కొంత మంది సకాలంలో చెల్లిస్తారు. కొందరు జరిమానాతో తరువాత నెల కడుతుంటారు. ఇలాంటి జాప్యం లేకుండా ఏ నెలలో జారీ చేసిన బిల్లులు ఆ నెలాఖరులోగా వసూలయ్యేలా చూడాలని ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించారు. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి పెద్ద మొత్తాలు రావని భావించిన అధికారలు వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులను ఆశ్రయిస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తరహా పరిశ్రమలు, ఐటీ కంపెనీల ప్రతినిధుల వద్దకు వెళ్లి ఏమాత్రం ఆలస్యం లేకుండా బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
ఈపీడీసీఎల్‌కు శ్రీకాకుళం జిల్లా నుంచి ఏలూరు వరకు ప్రతినెలా సుమారు రూ.వెయ్యి కోట్టు బిల్లుల రూపంలో వసూలవుతుంది. ఏ జోన్ పరిఽధిలో ఎంత బిల్లింగ్ జరిగిందో అక్కడి డీఈలు లెక్క చూసుకుని, అందులో ఎంత వసూలైంది? ఇంకా వసూలు కావలసింది ఎంత? ఎవరి నుంచి రావాలి? వంటి వివరాలు పరిశీలించి వినియోగదారుల వెంట పడుతున్నారు. ఇంజనీర్లకు టార్గెట్లు విధిస్తే బకాయిలు ఉండవని, వారం పది రోజులు ఆలస్యమైనా బిల్లులు చెల్లిస్తారని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది రూ.లక్షల బకాయిలు పెడుతున్నారు. వాటిని తగ్గించుకోవాలంటే... నెలాఖరుకల్లా వసూలు చేయడమే మార్గమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆలోచన బాగానే ఉంది కానీ ఆ బాధ్యత తమపై పెట్టడం ఏమిటని ఇంజనీర్లు వాపోతున్నారు.