వరి రైతు వర్రీ
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:46 PM
బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాకు భారీగా వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు
పంటను కాపాడుకునేందుకు అవస్థలు
వరి పనలను కుప్పలుగా పెట్టుకుంటున్న రైతులు
మరికొందరు యంత్రాలతో నూర్పులు
భారీ వర్షాలు కురిస్తే పంట నాశనమవుతుందని ఆవేదన
పాడేరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాకు భారీగా వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే శుక్రవారం ఉదయం నుంచి జల్లులు కురవగా రాత్రి వేళలో వర్షం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలించడంతో జిల్లాలో వరి పంట ఆశాజనకంగా పండింది. మరో రెండు వారాల్లో దాదాపుగా కోతలు సైతం పూర్తయ్యే పరిస్థితి. ఈ తరుణంలో తుఫాన్ ఏర్పడడంతో భారీ వర్షాలు కురిస్తే చేతికి వచ్చే పంట నాశనమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే శుక్రవారం ఉదయం జల్లులతో కూడిన వర్షం కురవడంతో ముందు జాగ్రత్త చర్యగా కోసిన వరి పంటలను యంత్రాలతో నూర్పించే పనిలో కొందరు రైతులు నిమగ్నం కాగా, మరికొందరు కోసిన వరి పనలను కుప్పలు వేసే పనిలో ఉన్నారు. అలాగే ఇప్పటికే అనేక చోట్ల కోసిన వరి పనలు ఇళ్లకు మోసుకెళ్లే అవకాశం లేక రైతులు పంట పొలాల్లోనే ఉంచేశారు. పలువురు అవకాశం ఉన్న మేరకు కుప్పలు వేసుకుని ప్లాస్టిక్ కవర్లు కప్పి పంటను రక్షించుకుంటున్నారు. తాజా ప్రతికూల వాతావరణంలో ఎటువంటి నష్టం వాటిల్లుతుందోనని రైతులు భయపడుతున్నారు. పంట బాగా పండి చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురిస్తే నాశనమయ్యే ప్రమాదముందని రైతులు అంటున్నారు. ఈ క్రమంలో తమ పంటను కాపాడుకునే పనుల్లో అన్నదాతలు బిజీగా ఉన్నారు.