ఆర్వో ప్లాంట్ తనిఖీ
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:36 AM
అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ వద్ద గల ఆర్వో ప్లాంట్‌ను పంచాయతీ కార్యదర్శి శైలజరాణి గురువారం తనిఖీ చేశారు.
- రెట్టింపు ధరకు నీళ్లు విక్రయిస్తున్నట్టు గుర్తించిన పంచాయతీ కార్యదర్శి
- ఇకపై 20 లీటర్ల నీళ్లు రూ.5కే విక్రయిస్తామని వెల్లడి
- తనిఖీలకు ముందే ఖాళీ వాటర్ బాటిళ్లను తరలించేసిన నిర్వాహకుడు
అచ్యుతాపురం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ వద్ద గల ఆర్వో ప్లాంట్‌ను పంచాయతీ కార్యదర్శి శైలజరాణి గురువారం తనిఖీ చేశారు. ఇక్కడ 20 లీటర్ల వాటర్ క్యాన్ రూ.10లకు విక్రయించడమే కాకుండా లీటరు, అరలీటరు బాటిళ్లను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ‘పంచాయతీ ఆదాయం పక్కదారి’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి ఈ తనిఖీలు చేపట్టారు. ఇక నుంచి ఇతరులకు 20 లీటర్ల నీటిని కేవలం ఐదు రూపాయలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా ఇస్తామని ఆమె తెలిపారు. కాగా కార్యదర్శి వెంట సర్పంచ్ విమలకుమారి రావలసి ఉండగా, ఆమెకు బదులుగా సర్పంచ్ భర్త వెంకునాయుడు రావడం చర్చనీయాంశమైంది. ఏ కార్యక్రమమైనా సర్పంచ్‌కు బదులు ఆయనే వెళుతుంటారని పలువురు చర్చించుకున్నారు.
పంచాయతీ వాహనంలో ఖాళీ బాటిళ్ల తరలింపు
ఆర్వో ప్లాంట్ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో ప్లాంట్‌లో నిల్వ చేసిన లీటర్, అరలీటర్ ఖాళీ సీసాలను అక్కడ నుంచి తరలించడానికి ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న శ్రీనివాసరావుకు పంచాయతీ పాలకవర్గం, అధికారులు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ పరిధిలో చెత్తను తరలించే వ్యాన్‌లో ఈ ఖాళీ సీసాలను మార్టూరు రోడ్డులోని ఇందిరమ్మకాలనీలో గల శ్రీనివాసరావు ఇంటికి తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు.