Share News

సదరం...గందరగోళం

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:25 AM

‘సదరం’ వెబ్‌సైట్‌లో స్లాట్ల కేటాయింపు సక్రమంగా లేదనే వాదన వినిపిస్తోంది.

సదరం...గందరగోళం

స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో పరీక్షకు స్లాట్లు లభించకుంటే

పొరుగు జిల్లాల ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి

దూరాభారం కావడంతో దివ్యాంగుల ఆందోళన

అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన సమస్య

విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):

‘సదరం’ వెబ్‌సైట్‌లో స్లాట్ల కేటాయింపు సక్రమంగా లేదనే వాదన వినిపిస్తోంది. దీనిపై అసెంబ్లీలో గురువారం చర్చ జరిగింది. విశాఖ జిల్లాకు చెందిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఈ సమస్యను ప్రస్తావించారు. ఎవరైనా దివ్యాంగులు సర్టిఫికెట్‌ కావాలనుకుంటే...వారిని స్లాట్‌ ఖాళీ లేదనే కారణంతో పొరుగు జిల్లాలకు వెళ్లమంటున్నారని, ఇది దూరాభారంతో కూడుకున్నదని సభ దృష్టికి తెచ్చారు.

ఏమి జరుగుతున్నదంటే...?

సదరంలో ఇచ్చే దివ్యాంగుల సర్టిఫికెట్లకు భారీగా డిమాండ్‌ ఉంది. ప్రభుత్వం ప్రతి నెలా ఇంతమందికి సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతూ సమీప ఏరియా ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తోంది. ఇందుకోసం ముందుగానే ప్రకటన జారీ చేస్తున్నారు. రైళ్లకు తత్కాల్‌ టిక్కెట్లు ఇవ్వడానికి ఎలా ఒక సమయం కేటాయిస్తారో...వీటికీ అలాగే చేస్తున్నారు. గతంలో ప్రతి నెలా స్లాట్‌ బుకింగ్‌ సమయం ఇచ్చేవారు. ఇటీవల రెండు నెలలకు ఒకేసారి స్లాట్లు ఇస్తున్నారు. అక్టోబరు, నవంబరు నెలల స్లాట్లు అక్టోబరులోనే ఇచ్చేశారు. అయితే ఈఎన్‌టీ, తదితర సమస్యలు ఉన్నవారికి సర్టిఫికెట్ల జారీలో పెద్దగా ఇబ్బంది లేదు. ఇతరత్రా సమస్యలు ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల పొరుగునున్న జిల్లాల ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ఉదాహరణకు విశాఖ జిల్లాలో కేజీహెచ్‌ కావాలని చాలామంది ఆప్షన్‌ తీసుకుంటున్నారు. ఆ స్లాట్లు అయిపోగానే పక్కనే ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు ఏరియా ఆస్పత్రులలో ఖాళీ స్లాట్లు ఉన్నాయని, అక్కడకు వెళ్లవచ్చునని సచివాలయాల సిబ్బంది సూచిస్తున్నారు. సర్టిఫికెట్లు అత్యవసరంగా కావాలనుకునేవారు దూరాభారం అయినా తప్పనిసరై అక్కడకు వెళుతున్నారు. 100 శాతం వైకల్యం కలిగిన వారికి సహాయంగా మరొకరు అంతదూరం వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్య పెద్ద జిల్లాల్లో ఎక్కువగా ఉన్నందున దీనికి పరిష్కారం చూపించాల్సి ఉంది.

ఇటీవల డాబాగార్డెన్స్‌కు చెందిన ఓ మహిళ సదరం స్లాట్‌ కావాలని సచివాలయానికి వెళితే...కేజీహెచ్‌లో లేదని అనకాపల్లి వెళ్లాలని సూచించారు. అలాగే మరికొందరికి పాడేరు, నర్సీపట్నం వెళ్లాల్సిందిగా చెబుతున్నారు. విశాఖలో స్లాట్లు ఖాళీ లేనందునే పక్కనే ఉన్న ఏరియా ఆస్పత్రులను సూచిస్తున్నామని, వారికి ఇష్టం లేకపోతే విశాఖలో స్లాటు దొరికే వరకు వేచి ఉండవచ్చునని, అందులో బలవంతం ఏమీ ఉండదని సిబ్బంది చెబుతున్నారు. దీనికి అధికారులు ఏ విధంగా పరిష్కారం చూపిస్తారో చూడాల్సి ఉంది.

Updated Date - Nov 15 , 2024 | 01:25 AM