Share News

అగనంపూడిలో ఇసుక మాయం!

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:10 AM

జిల్లాలో భీమిలి, అగనంపూడి డిపోల్లో ఇసుక అమ్మకాల్లో తేడాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అగనంపూడిలో ఇసుక మాయం!

సుమారు 20 వేల టన్నులకు తేలని లెక్క

విక్రయాలకు, నిల్వకు మధ్య తేడా

నిర్దేశించిన ప్రమాణం కంటే ఎక్కువగా తరలించారనే విమర్శలు

డిపో నిర్వాహకులు, లారీ ఓనర్ల పాత్రపై అనుమానం

భీమిలి డిపోలో ఇసుక లెక్కలపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక

విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో భీమిలి, అగనంపూడి డిపోల్లో ఇసుక అమ్మకాల్లో తేడాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగనంపూడి డిపోలో సుమారు 15 వేల నుంచి 20 వేల టన్నుల ఇసుక మాయమైందని చెబుతున్నారు. డిపోలో ఉన్న ఇసుక అమ్మకాల సమయంలో ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కొందరు వ్యాపారులు, ప్రధానంగా లారీ ఓనర్ల ప్రమేయం ఉందనే వాదన వినిపిస్తోంది.

ఇసుక లెక్కల్లో తేడాలకు సంబంధించి డిపోను నిర్వహించే రెవెన్యూ, గనుల శాఖ సిబ్బంది, కొందరు లారీ ఓనర్ల హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుండగా భీమిలి డిపోలో కూడా అనధికారికంగా ఇసుక తరలించారనే విమర్శల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది.

ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం మారిన తరువాత జిల్లాలో రెండు డిపోలను అధికారులు స్వాధీనం చేసుకుని డిపోల్లో నిల్వలపై కొలతలు వేసి భీమిలిలో 90 వేల టన్నులు, అగనంపూడిలో 92వేల టన్నుల ఇసుక నిల్వ ఉందని గనులశాఖ సిబ్బంది తేల్చారు. గత నెలలోనే భీమిలిలో ఇసుక అమ్మకాలు పూర్తిచేశారు. ఇక్కడ 90 వేల టన్నులకు గాను 40వేల టన్నుల అమ్మకాలు చేపట్టారు. డిపో పక్కన చెత్త డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే మురుగునీరు రావడంతో ఐదారువేల టన్నుల ఇసుక బురదమయమైంది. అయితే మిగిలిన ఇసుక విషయంలోనూ తేడాలు ఉండడంతో జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక పంపింది. డిపోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోక ముందే కొందరు స్థానిక నాయకులు రాత్రిపూట తరలించుకుపోయారని, మరికొంత ఇసుక అక్కడి నిర్వాహకులు, స్థానిక నాయకులు కలిసి అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఇదిలావుండగా అగనంపూడి డిపోలో 90 వేల టన్నుల నిల్వలున్నట్టు కొలతలు వేయగా ఈనెల 11వతేదీ వరకు 64వేల టన్నులు విక్రయించారు. వర్షం కారణంగా గ్రౌండ్‌ లాస్‌ పదివేల టన్నుల వరకు ఉంటుందని అంచనా వేశారు. మరో ఐదారువేల టన్నులు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఇళ్ల నిర్మాణాలకు ఉంచారు. స్వాధీనం చేసుకునేటప్పుడు ఉన్న నిల్వ, విక్రయాలు, గ్రౌండ్‌ లాస్‌, ఇళ్ల నిర్మాణాలకు కేటాయించగా మిగిలిన 15 వేల టన్నుల నుంచి 20 వేల టన్నుల ఇసుక ఏమైందనేది ప్రశ్న. దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇసుక తేడా వ్యవహారంలో డిపో నిర్వహించే రెవెన్యూ, గనుల శాఖ సిబ్బంది, స్థానికంగా ఉన్న కొందరు లారీ ఓనర్ల హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. అగనంపూడి డిపోలో ఇసుక అమ్మకాల్లో అక్కడ సిబ్బంది, లారీ ఓనర్లు కుమ్మక్కైయ్యారనేది బహిరంగ రహస్యం. అమ్మకాల సమయంలో కొనుగోలుచేసిన దాని కంటే ఎక్కువగా ఇసుక తరలించుకుపోయారనే ఆరోపణలున్నాయి. దీనిపై అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదిక రూపొందించేపనిలో ఉన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 01:10 AM