Share News

ఇసుక నిల్‌

ABN , Publish Date - Sep 12 , 2024 | 01:13 AM

జిల్లాలో ప్రస్తుతం ఇసుక లేదు. రెండు డిపోల్లో గల ఇసుక మొత్తం అయిపోయింది. భీమిలి డిపో రెండు వారాల క్రితమే ఖాళీ కాగా, అగనంపూడిలో మంగళవారం నుంచి బుకింగ్‌ ఆపేశారు. దీంతో జిల్లా పరిధిలో అధికారికంగా ఇసుక నిల్వలు లేనట్టేనని అధికారులు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో నగరంలో ఇళ్ల నిర్మాణదారులకు అవసరమైన ఇసుక దొరికే పరిస్థితి లేదు.

ఇసుక నిల్‌

రెండు డిపోలు ఖాళీ

అగనంపూడిలో బుకింగ్స్‌ నిలిపివేత

జిల్లా అవసరాల కోసం

శ్రీకాకుళం జిల్లాలో రెండు రీచ్‌లు గుర్తింపు

వరదలు రావడంతో ప్రస్తుతం తవ్వకాలకు

అనుకూలించని వాతావరణం

గోదావరి నుంచి తీసుకురావడం కష్టమే

నిర్మాణదారులకు మొదలు కానున్న కష్టాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ప్రస్తుతం ఇసుక లేదు. రెండు డిపోల్లో గల ఇసుక మొత్తం అయిపోయింది. భీమిలి డిపో రెండు వారాల క్రితమే ఖాళీ కాగా, అగనంపూడిలో మంగళవారం నుంచి బుకింగ్‌ ఆపేశారు. దీంతో జిల్లా పరిధిలో అధికారికంగా ఇసుక నిల్వలు లేనట్టేనని అధికారులు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో నగరంలో ఇళ్ల నిర్మాణదారులకు అవసరమైన ఇసుక దొరికే పరిస్థితి లేదు.

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్‌లు లేకపోవడంతో పొరుగునున్న శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. గత ప్రభుత్వం ఇసుక అమ్మకాలకు డిపోలు ఏర్పాటుచేసిన తరువాత ధర పెరగడం, తరువాత కొన్నాళ్లు కృత్రిమ కొరత ఏర్పడడం వంటి ఇబ్బందులు వచ్చాయి. గత పాలకుల హయాంలో ఇసుక అమ్మకాలు చేపట్టిన ఇన్‌ఫ్రా కంపెనీ జిల్లాలో భీమిలి, అగనంపూడి డిపోల్లో రెండు లక్షల టన్నులు ఇసుక నిల్వ చేసింది. హౌసింగ్‌ నిర్మాణాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు విభాగాల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు పంపిణీ చేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఇన్‌ఫ్రా కంపెనీ ఇసుక అమ్మకాల నుంచి తప్పుకుంది. దీంతో డిపోల్లో కొంత ఇసుకను స్థానికంగా ఉండే రెవెన్యూ సిబ్బంది సాయంతో కొందరు వాహన యజమానులు తరలించుకుపోయారు. ఈ ఏడాది జూలై ఎనిమిదో తేదీ నుంచి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో గనులు, రెవెన్యూ శాఖ అధికారులు భీమిలి, అగనంపూడి డిపోల్లో ఇసుక అమ్మకాలు ప్రారంభించారు. భీమిలి డిపోలో నిల్వలు 40 రోజులకు అయిపోయాయి. దాంతో అందరికీ అగనంపూడి డిపోయే ఆధారమైంది. రోజుకు 1,000 నుంచి 1,500 టన్నుల వరకూ అమ్మకాలు జరిగాయి. అక్కడ కూడా దాదాపు అయిపోవడంతో మంగళవారం నుంచి బుకింగ్స్‌ నిలిపివేశారు. ఇదిలావుండగా నగర అవసరాలకు శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో రెండు రీచ్‌లను గుర్తించారు. నదీ ప్రవాహ దిశ మారే క్రమంలో ఏర్పడిన ఇసుక మేటలు తవ్వకాలకు అనువుగా ఉంటాయని గనుల శాఖ గుర్తించింది. అయితే తాజా వర్షాలతో వంశధారకు వరద పెరిగింది. నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన తరువాత గుర్తించిన రెండు రీచ్‌ల వద్ద తవ్వకాలకు వీలుపడుతుందా?, లేదా?...అనేది చూడాలని అధికారులు అంటున్నారు. ఇందుకు మరో వారం, పది రోజులు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. గోదావరి నుంచి ఇసుక తీసుకువద్దామంటే ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఉంది. రెండు నదుల్లో ప్రవాహాలు తగ్గుముఖం పట్టిన తరువాతే ఇసుక తవ్వకాలకు వీలుపడుతుందని అంటున్నారు. అప్పటివరకూ నగరంలో నిర్మాణదారులకు ఇసుక లభించే పరిస్థితి లేదు. పోనీ ఒడిశా నుంచి ఇసుక తీసుకువద్దామన్నా అక్కడ కూడా భారీవర్షాలతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని నదీ తీర ప్రాంతాల్లో గల తోటలు, పొలాల్లో అనధికారికంగా ఉన్న ఇసుక నిల్వలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బహిరంగ మార్కెట్‌లో విక్రయించడం ఒక్కటే మార్గమని అధికారులు అంటున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 01:13 AM