Share News

కౌన్సిల్‌ సమావేశంలో ఇసుక దుమారం

ABN , Publish Date - Oct 01 , 2024 | 01:54 AM

ఇసుక కొరత, పారిశుధ్య పనులకు నిధుల వినియోగంపై మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు, ఆరోపణలతో ఉద్రిక్తంగా సాగింది.

కౌన్సిల్‌ సమావేశంలో ఇసుక దుమారం

టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం

పారిశుధ్య పనులకు సాధారణ నిధుల వ్యయంపై గొడవ

మెయిన్‌ రోడ్డులో ఫుట్‌పాత్‌ ఆక్రమణలు తొలగించాలని ఇరుపక్షాల సభ్యులు డిమాండ్‌

నర్సీపట్నం, సెప్టెంబరు 30:

ఇసుక కొరత, పారిశుధ్య పనులకు నిధుల వినియోగంపై మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు, ఆరోపణలతో ఉద్రిక్తంగా సాగింది. ఒకానొక దశలో బిగ్గరగా కేకలు వేసుకున్నారు. దీంతో ఎవరు, ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన సోమవారం సాధారణ సమావేశం జరిగింది. వైసీపీకి చెందిన వైస్‌ చైర్మన్‌ కోనేటి రామకృష్ణ మాట్లాడుతూ, ఇసుక దొరక్క ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మరోవైపు భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయని అన్నారు. టీడీపీ కౌన్సిలర్‌ దనిమిరెడ్డి మధుబాబు మాట్లాడుతూ, గబ్డాడలో గత ప్రభుత్వం నిర్వహించిన ఇసుక డిపోలో జరిగిన అవకతవకలపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు విచారణ చేయిస్తున్నారని అన్నారు. వైస్‌ చైర్మన్‌ తమరాన అప్పలనాయుడు ప్రతిస్పందిస్తూ.. విచారణ చేసుకుంటే తమకు అభ్యంతరం లేదు, అక్కడ ఎంత ఇసుక ఉందో లెక్కలు తేల్చి, త్వరగా భవన నిర్మాణదారులకు అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్‌ చింతకాయల రాజేశ్‌, వైసీపీ వైస్‌ చైర్మన్‌ కోనేటి రామకృష్ణల మధ్య వాగ్వాదం జరిగింది. స్పీకర్‌ పర్యటన నుంచి వచ్చిన వెంటనే గబ్బాడ ఇసుకపై నిర్ణయం తీసుకుంటారని రాజేశ్‌ అన్నారు.

అంతకు ముందు వైస్‌ చైర్‌పర్మన్‌ కోనేటి రామకృష్ణ మాట్లాడుతూ, పారిశుధ్య పనులకు రూ.1.7 కోట్లు సాధారణ నిధుల నుంచి కేటాయించారని, ఆ నిధులను ప్రజల అవసరాలకు ఉంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు కృషి చేయాలని అన్నారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు డబ్బీరు శ్రీకాంత్‌, ధనిమిరెడ్డి మధుబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డుల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, ఈ విషయాన్ని ఎన్నోసార్లు కౌన్సిల్‌లో సమావేశంలో ప్రస్తావించామని, అయినా పాలకవర్గం పట్టించుకోలేదని ఆరోపించారు. పారిశుధ్యం కోసం ఇప్పుడు రూ.1.7 కోట్లు ఖర్చు చేస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ను అభినందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఇరువురి కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వైస్‌ చైర్మన్‌ తమరాన అప్పలనాయుడు మాట్లాడుతూ, పెదబొడ్డేపల్లిలో నిరుపయోగంగా వున్న మరగుదొడ్ల మరమ్మతులకు రూ.7 లక్షలు కేటాయించడం ఎందుకని ప్రశ్నించారు. ఆ నిధులతో సచివాలయ భవనాన్ని మరమ్మతులు చేయించాలని సూచించారు. మునిసిపల్‌ కమిషనర్‌ సురేంద్ర మాట్లాడుతూ, బహిరంగ మల విసర్జన నిర్మూలనకు పబ్లిక్‌ టాయిలెట్స్‌ అవసరమని అన్నారు. దీనిపై ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

మెయిన్‌ రోడ్డులో ఫుట్‌పాత్‌ ఆక్రమణలు తొలగించాలని వైస్‌చైర్మన్‌ తమరాన అప్పలనాయుడు కోరారు. టీడీపీ కౌన్సిలర్‌ మధుబాబు మాట్లాడుతూ, దనిమిరెడ్డి వీధిలో ఐస్‌ ప్లాంట్‌ మిషనరీ, వాటర్‌ ట్యాంక్‌ను డ్రైనేజీ కాలువ మీద నిర్మించారని, వాటిని కూడా తొలగించాలని అన్నారు. వైసీపీ కౌన్సిలర్‌ మాకిరెడ్డి బుల్లిదొర మాట్లాడుతూ, స్కేటింగ్‌ రింక్‌ ప్రాంగణంలో బాక్సింగ్‌ రింగ్‌, ఇండోర్‌ హాల్‌ నిర్మాణ పనులు రద్దు చేసినట్టు స్పోర్ట్‌ అథారిటీ నుంచి సమాచారం ఏమైనా ఉందా అని అడిగారు. టీడీపీ కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అన్ని సౌకర్యాలతో క్రీడాకారుల కోసం ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

Updated Date - Oct 01 , 2024 | 01:54 AM