Share News

అనకాపల్లిలో పారిశుధ్యం అధ్వానం

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:42 AM

అనకాపల్లిలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం అనకాపల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువల్లో పూడిక పేరుకుపోయి వుండడాన్ని గమనించారు. అన్నిచోట్లా డ్రైనేజీ కాలువల్లో పూడిక, వ్యర్థాలు అధికంగా ఉన్నాయని, పారిశుధ్య పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని శానిటరీ సూపర్‌వైజర్‌, ఇన్‌స్పెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనకాపల్లిలో పారిశుధ్యం అధ్వానం
పట్టణంలో పారిశుధ్యం సక్రమంగా లేదంటూ శానిటరీ సూపర్‌వైజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌కుమార్‌

జీవీఎంసీ కమిషనర్‌ అసహనం

డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు

శానిటరీ సూపర్‌వైజర్‌, ఇన్‌స్పెక్టర్లపై ఆగ్రహం

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశం

అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లిలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం అనకాపల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువల్లో పూడిక పేరుకుపోయి వుండడాన్ని గమనించారు. అన్నిచోట్లా డ్రైనేజీ కాలువల్లో పూడిక, వ్యర్థాలు అధికంగా ఉన్నాయని, పారిశుధ్య పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని శానిటరీ సూపర్‌వైజర్‌, ఇన్‌స్పెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయన జోనల్‌ కార్యాలయం ఆవరణలోని కంపోస్టు యార్డును పరిశీలించారు మొబైల్‌ కాంపాక్టర్‌ షెడ్డు నిర్మాణం చేసి, క్లోజ్డ్‌ కాంపాక్ట్‌ విధానంలో చెత్తను తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శంకరం వద్ద గల సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను పరిశీలించి, చుట్టు మొక్కలను నాటి అందంగా తీర్చిదిద్దాలన్నారు. 15వ ఆర్థికసంఘం నిధులతో అగనంపూడి నుంచి అనకాపల్లి వరకు 500 ఎం.ఎం. వ్యాసార్థంతో జరుగుతున్న పైపులైన్‌ నిర్మాణ పనులను డిసెంబరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. లక్ష్మీదేవిపేటలో 1000 కిలో లీటర్ల ఎలివేటడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్‌ (ఈఎల్‌ఎస్‌ఆర్‌) పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంను పరిశీలించిన ఆయన చివర దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

అనకాపల్లిలో వీధి కుక్కలు అధికంగా వున్నాయని, వీటిని కట్టడి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించిన నిర్మాణాలకు టీడీఆర్‌లు వెంటనే మంజూరు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏసీపీ రామకృష్ణను ఆదేశించారు. గుండాల వద్ద నిర్మాణంలో ఉన్న గెస్ట్‌హౌస్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. మంచినీటి సరఫరా విభాగాన్ని పరిశీలించిన కమిషనర్‌.. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరును అందించాలని స్పష్టం చేశారు. ఆయన వెంట ప్రధాన ఇంజనీర్‌ శివప్రసాద్‌రాజు, పర్యవేక్షక ఇంజనీర్‌ రామ్మోహనరావు, డీడీహెచ్‌ దామోదరరావు, కార్యనిర్వాహక ఇంజనీర్లు చిరంజీవులు, ఏడుకొండలు, శేఖర్‌, ఏపీడీ సంతోష్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:43 AM