Share News

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:46 AM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరిగింది. విశాఖ పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాల నామినేషన్ల పరిశీలన ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైంది.

ముగిసిన నామినేషన్ల పరిశీలన

లోక్‌సభ స్థానానికి 39 మంది నామినేషన్లు వేయగా ఆరుగురివి తిరస్కృతి

ఏడు అసెంబ్లీ స్థానాలకు 147 మంది నామినేషన్లు...

28 మంది నామినేషన్లు తిరస్కృతి

పెందుర్తి, విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో కొద్దిసేపు ఉత్కంఠ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరిగింది. విశాఖ పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాల నామినేషన్ల పరిశీలన ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైంది. లోక్‌సభకు 39 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఆరుగురి నామినేషన్లను, ఏడు అసెంబ్లీ స్థానాలకు 147 మంది నామినేషన్లు వేయగా 28 మంది నామినేషన్లు సక్రమంగా లేవని అధికారులు తిరస్కరించారు. పార్లమెంటు స్థానానికి 33, అసెంబ్లీ సెగ్మెంట్లకు 119 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని వెల్లడించారు.

విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి దాఖలైన మొత్తం 39 నామినేషన్లలో ఆరింటిని ఆర్‌వో, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తిరస్కరించారు. మిగిలిన 33 సక్రమంగా ఉన్నట్టు నిర్ధారించారు. పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు అమిత్‌శర్మ, పోలీస్‌ పరిశీలకులు అమిత్‌కుమార్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో ఆర్‌వో, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున స్థానిక కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో శుక్రవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కో నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అఫిడవిట్‌ పత్రంలో సంతకం చేయని కారణంగా స్వతంత్ర అభ్యర్థి మెహబూబ్‌ సుభాన్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ఆర్‌వో ప్రకటించారు. అలాగే ఫార్మెట్‌ ప్రకారం దరఖాస్తు సమర్పించని కారణంగా స్వతంత్ర అభ్యర్థి వియ్యపు గంగరాజు, జై భీమ్‌రావు భారత్‌ పార్టీ అభ్యర్థి నక్క నమ్మిగ్రేస్‌ నామినేషన్లను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రధాన అభ్యర్థులకు ప్రత్యామ్నాయంగా వేసిన మతుకుమిల్లి తేజస్విని, బొత్స అనూషల నామినేషన్లను తిరస్కరిస్తున్నట్టు ఆర్‌వో స్పష్టంచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన పట్టపగలు రాజారమేష్‌ పత్రాల్లో ప్రతిపాదించిన వారి సంతకాలన్నీ ఒకేలా ఉండడంతో ఆర్‌వో అభ్యంతరం వ్యక్తంచేసి సంబంధిత అభ్యర్థి వివరణ కోరారు. ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఆర్‌వో నామినేషన్‌ను తిరస్కరించారు. బ్లూ ఇండియా పార్టీ తరపున మురాల అరుణశ్రీ, రాడికల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి దేవర శంకర్‌ వేసిన నామినేషన్లతో ఫామ్‌-ఏ, ఫామ్‌-బి సరిగా లేని కారణంగా ప్రపోజల్స్‌ సంతకాలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తించి ఆర్‌వో ఆమోదం తెలిపారు.

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 28 తిరస్కృృతి..

భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి మొత్తం 20 మంది నామినేషన్లు దాఖలు చేయగా 17 మందివి ఆమోదించి, ముగ్గురివి తిరస్కరించారు. తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఆయన తనయుడు గంటా రవితేజ, కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్డాల వెంకట వర్మరాజుకు డమ్మీగా ఆయన సతీమణి స్వప్న అడ్డాల, వైసీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు ప్రత్యామ్నాయ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ముత్తంశెట్టి జ్ఞానేశ్వరి నామినేషన్లను తిరస్కరించారు. విశాఖ తూర్పులో మొత్తం 23 నామినేషన్లలో 15 సక్రమంగా ఉన్నట్టు ఆర్వో మయూర్‌ అశోక్‌ వెల్లడించారు. మరో ఎనిమిది నామినేషన్లు సక్రమంగా లేని కారణంగా తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, ఎంవీవీ సత్యనారాయణ, గుత్తుల శ్రీనివాసరావుకు ప్రత్యామ్నాయంగా వెలగపూడి సుజన, ముళ్లపూడి నాగజ్యోతి, మోనిక నామినేషన్లు తిరస్కరించారు. ఇంకా కె.శ్రీనివాసరావు, ఇ.సురే్‌ష, ఇ.రజని, వి.గోవిందు, ఎస్‌.సుశీల అనేవారి నామినేషన్లు సక్రమంగా లేవని తిరస్కరించారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో మొత్తం 24 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 16 నామినేషన్లు ఆమోదించారు. మరో ఎనిమిదింటిని తిరస్కరించారు. గొంప గోవిందరావు, గొంప త్రివేణి, పి.శ్యామల, జి. కమలాకరరావు, కె.బాలాజీ, కె.మమత, ఎం.సరోజిని, సాహితి నామినేషన్లు తిరస్కరించారు.

దక్షిణ నియోజకవర్గానికి మొత్తం 20 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఒకరిది తిరస్కరించారు. వైసీపీ నుంచి వాసుపల్లి గణే్‌షకుమార్‌కు ప్రత్యామ్నాయంగా ఆయన సతీమణి ఉషారాణి దాఖలుచేసిన నామినేషన్‌ను తిరస్కరించారు. పశ్చిమలో మొత్తం దాఖలైన 18 నామినేషన్లలో 2 నామినేషన్లను తిరస్కరించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు గణబాబు, ఆడారి ఆనందకుమార్‌కు ప్రత్యామ్నాయంగా పెతకంశెట్టి మౌర్య, ఆడారి మాలతి వేసిన నామినేషన్లను తిరస్కరించారు. 16 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్లు ఆర్వో హుస్సేన్‌ సాహెబ్‌ తెలిపారు. పెందుర్తిలో 20 మంది నామినేషన్లు దాఖలు చేయగా పరిశీలనలో ఒకరి నామినేషన్‌ తిరస్కరించారు. వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీ్‌పరాజ్‌కు ప్రత్యామ్నాయంగా ఆయన సతీమణి శిరీష నామినేషన్‌ను తిరస్కరించారు. గాజువాకలో 21 మంది అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయగా 16 మంది నామినేషన్లను ఆమోదించి ఐదుగురివి తిరస్కరించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు, గుడివాడ అమర్‌నాథ్‌లకు ప్రత్యామ్నాయంగా పల్లా కార్తీక్‌యాదవ్‌, ఆర్‌.హిమగౌరి దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరించారు. ఇంకా ఎం.రాంబాబు, చోడవరపు శంకర్‌, పి.సత్యనారాయణమూర్తి నామినేషన్లు తిరస్కరించారు.

అదీప్‌రాజ్‌, ఎంవీవీ నామినేషన్లపై టీడీపీ అభ్యంతరం

పెందుర్తి, విశాఖ తూర్పు పరిధిలో తప్ప మిగిలినచోట్ల మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తయింది. పెందుర్తిలో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీ్‌పరాజ్‌ తన నామినేషన్‌లో క్రిమినల్‌ కేసుల వివరాలు ప్రస్తావించకపోవడంతో జనసేన అభ్యర్థి పంచకర్ల రమే్‌షబాబు అభ్యంతరం తెలపడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విశాఖ తూర్పులో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చదువు విషయంలో 2019లో అఫిడవిట్‌కు, తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌కు మధ్య బోలెడు తేడా ఉండడంతో టీడీపీ నుంచి పట్టాభి అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఎన్నికల పరిశీలకుడు వచ్చి వివరణ ఇచ్చేంత వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరికి ఇద్దరి నామినేషన్లను ఆమోదించారు.

Updated Date - Apr 27 , 2024 | 01:46 AM