వణికిస్తున్న చలి
ABN , Publish Date - Dec 26 , 2024 | 11:29 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకోవడంతో జిల్లాలో గురువారానికి ముసురు తగ్గి, ఎండకాసినప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గలేదు. ఉదయం పది గంటల వరకు ముసురు వాతావరణం ఉన్నప్పటికీ ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఎండకాసింది.
పెదబయలులో 16.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
పాడేరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకోవడంతో జిల్లాలో గురువారానికి ముసురు తగ్గి, ఎండకాసినప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గలేదు. ఉదయం పది గంటల వరకు ముసురు వాతావరణం ఉన్నప్పటికీ ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఎండకాసింది. సాయంత్రం వరకు అదే వాతావరణం కొనసాగింది. దాదాపుగా నాలుగు రోజులుగా ఏజెన్సీలో ముసురు వాతావరణం నెలకొని గురువారం ఎండకాయడంతో జన జీవనం సాధారణ స్థితికి చేరుకుంది.
స్థిరంగా కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
తాజా వాతావరణం నేపథ్యంలో ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలోని పెదబయలులో 16.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జీకేవీధిలో 16.8, అరకులోయలో 17.1, డుంబ్రిగుడ, జి.మాడుగులలో 17.4, పాడేరులో 17.9, చింతపల్లిలో 18.0, హుకుంపేట, ముంచంగిపుట్టులో 18.1, అనంతగిరిలో 18.7, కొయ్యూరులో 19.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అనంతగిరిలో..
అనంతగిరి: మండలంలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. గురువారం ఉదయం 9 గంటల వరకు పొగమంచు వీడలేదు. అరకు- విశాఖ ప్రధాన రహదారిలో ప్రయాణించిన వాహనచోదకులు మంచుతో కూడిన ప్రకృతి అందాలను ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని ఎంజాయ్ చేశారు. ఆర్టీసీ బస్సులు సైతం లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి.