Share News

భారీ వాహనాలకు బ్రేక్‌ వేయరా!?

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:14 AM

ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా నగర ట్రాఫిక్‌ పోలీసుల తీరు మారడం లేదు.

భారీ వాహనాలకు బ్రేక్‌ వేయరా!?

  • మారని ట్రాఫిక్‌ అధికారుల తీరు

  • నగరంలోకి యథేచ్ఛగా రాకపోకలు

  • రోడ్లపై నిలిచిపోతున్న ట్రాఫిక్‌

  • చోద్యంచూస్తున్న పోలీసులు

విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా నగర ట్రాఫిక్‌ పోలీసుల తీరు మారడం లేదు. రద్దీ వేళల్లో నగరంలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంపై ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ సమస్యపై ట్రాఫిక్‌ అధికారులు స్పందించి నిషేధ సమయంలో భారీ వాహనాలు రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకుంటారని అంతా ఆశించారు. కానీ శుక్రవారం కూడా భారీ వాహనాలు నగరంలో యథేచ్ఛగా తిరిగాయి. వాహనాలను అడ్డుకోవాల్సిన ట్రాఫిక్‌ సిబ్బంది...ఆయా వీధుల్లోకి ఇతర వాహనాలు వెళ్లకుండా స్టాపర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టడం విస్మయపరిచింది.

ట్రాఫిక్‌, తదితర సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాత్రి పది తరువాత మరుసటిరోజు ఉదయం ఏడు గంటల వరకూ మాత్రమే నగరంలోని అంతర్గత రహదారుల్లో భారీ వాహనాల ప్రవేశానికి వీలు కల్పించారు. ఒకవేళ ఏదైనా అత్యవసరమనుకుంటే పోలీస్‌ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందినట్టయితే మధ్యాహ్నం 12 గంటలు నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో అనుమతిస్తారు. కానీ ట్రాఫిక్‌ విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది మామ్మూళ్లు తీసుకుని భారీ వాహనాలను అన్నివేళల్లోనూ అనుమతిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటిదేమీ లేదని ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ అధికారుల ప్రకటనకు భిన్నంగా శుక్రవారం ఉదయం మద్దిలపాలెం, కేఆర్‌ఎం కాలనీ, చైతన్యనగర్‌ ప్రాంతాల్లో భారీ వాహనాలు ప్రవేశించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇరుకుగా ఉండే వీధుల్లోకి భారీ వాహనాలు వెళ్లడంతో ఇతర వాహనాల రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వాహన చోదకులు ఇరువైపులా గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైతన్యనగర్‌లో అయితే భారీవాహనం వెళ్లిన రోడ్డులోకి ఇతర వాహనాలు వెళ్లకుండా పోలీస్‌ సిబ్బంది ఏకంగా స్టాపర్‌ను అడ్డంగా పెట్టి మరీ సహకరించడం ఆరోపణలకు బలాన్ని చేకూర్చినట్టయింది. అదేవిధంగా భారీ కంటెయినర్లు, సరకు లోడుతో ఉన్న భారీ లారీలు శుక్రవారం సాయంత్రం అక్కయ్యపాలెం, ద్వారకా నగర్‌, మద్దిలపాలెంలోని వీఎంఆర్‌డీఏ షాపింగ్‌ కాంపెక్స్‌ రోడ్డులోకి వెళుతూ కనిపించాయి. మామ్మూళ్లు అందుతుండడం వల్లే ట్రాఫిక్‌ పోలీసులు భారీవాహనాలను అడ్డుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:14 AM