Share News

ఉద్యోగుల సమష్టి కృషితో సింహాద్రి పురోభివృద్ధి

ABN , Publish Date - Jul 09 , 2024 | 01:15 AM

సింహాద్రి ఎన్టీపీసీ పురోభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేశారని సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) సంజయ్‌కుమార్‌ సిన్హా అన్నారు.

ఉద్యోగుల సమష్టి కృషితో సింహాద్రి పురోభివృద్ధి
ఉద్యోగుల సమక్షంలో కేక్‌ కట్‌ చేస్తున్న సింహాద్రి సీజీఎం సంజయ్‌కుమార్‌ సిన్హా

పరవాడ, జూలై 8 : సింహాద్రి ఎన్టీపీసీ పురోభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేశారని సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) సంజయ్‌కుమార్‌ సిన్హా అన్నారు. సింహాద్రి ఎన్టీపీసీ 27వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ప్లాంట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీజీఎం తొలుత జెండాను ఆవిష్కరించారు. సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధికారులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు నాణ్యమైన విద్యుదుత్పత్తిని అందిస్తున్న ఘనత సింహాద్రి ఎన్టీపీసీకే దక్కుతుందన్నారు. నాణ్యమైన విద్యుదుత్పత్తిని సాధించడంలో దేశంలోనే సింహాద్రికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సంస్థ అన్ని రంగాల్లో విజయం సాదించడానికి ఉద్యోగులు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తున్నామన్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నామని వెల్లడించారు. వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా స్థానిక బాలభారతి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి జీఎంలు, ఏజీఎంలు, దీపికా లేడిస్‌ క్లబ్‌ అధ్యక్షురాలు అంజుసిన్హా, క్లబ్‌ ప్రతినిధులు, ఉద్యోగులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 01:16 AM