Share News

గ్రామాల్లోనూ స్మార్ట్‌ మీటర్లు

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:50 AM

విద్యుత్‌ సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఈపీడీసీఎల్‌ అధికారులు కొత్తగా స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ చౌర్యానికి చెక్‌ పెట్టడంతోపాటు మీటరు రీడింగ్‌ ఆన్‌లైన్‌ చేయడానికి ఇది దోహదపడుతుంది. పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య కేటగిరీలకు, ప్రభుత్వం కార్యాలయాలు, సంస్థలకు ఇప్పటికే స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం కాగా.. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్‌ మీటర్లను బిగిస్తున్నారు. మండల కేంద్రమైన కోటవురట్లలో నెల రోజుల నుంచి వాణిజ్య విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి పథకాలు, వీధి దీపాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వీటిని బిగిస్తున్నారు.

గ్రామాల్లోనూ స్మార్ట్‌ మీటర్లు
కోటవురట్ల పంచాయతీలో వీధి దీపాలకు స్మార్ట్‌ మీటర్‌ బిగిస్తున్న సిబ్బంది

తొలుత వాణిజ్య కేటగిరీ విద్యుత్‌ కనెక్షన్లకు బిగింపు

పంచాయతీల తాగునీటి పథకాలు, వీధి దీపాలకు సైతం..

కోటవురట్ల, నవంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఈపీడీసీఎల్‌ అధికారులు కొత్తగా స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ చౌర్యానికి చెక్‌ పెట్టడంతోపాటు మీటరు రీడింగ్‌ ఆన్‌లైన్‌ చేయడానికి ఇది దోహదపడుతుంది. పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య కేటగిరీలకు, ప్రభుత్వం కార్యాలయాలు, సంస్థలకు ఇప్పటికే స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం కాగా.. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్‌ మీటర్లను బిగిస్తున్నారు. మండల కేంద్రమైన కోటవురట్లలో నెల రోజుల నుంచి వాణిజ్య విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి పథకాలు, వీధి దీపాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వీటిని బిగిస్తున్నారు.

విద్యుత్‌ చౌర్యానికి చెక్‌

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్‌ మీటర్లతో విద్యుత్‌ చౌర్యానికి పూర్తిగా చెక్‌ పెట్టవచ్చని ఈపీడీసీఎల్‌ అధికారులు పేర్కొంటున్నారు విద్యుత్‌ వినియోగానికి సంబంధించి సిబ్బంది ప్రతి నెలా వచ్చి రీడింగ్‌ తీయాల్సిన అవసరం వుండదు. ఆన్‌లైన్‌ ద్వారా మానిటరింగ్‌ కేంద్రానికి మీటర్‌ రీడింగ్‌ చేరుతుంది. ఎన్ని యూనిట్లు వాడారు? ఎంత బిల్లు చెల్లించాలి? అన్న వివరాలు సంబంధిత వినియోగదారుని మొబైల్‌ ఫోన్‌కు మెసెజ్‌ ద్వారా తెలియపరుస్తారు. గడువులోగా బిల్లు చెల్లించకపోతే మానిటరింగ్‌ కేంద్రం నుంచే స్మార్ట్‌ మీటర్‌ ద్వారా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసే అవకాశం ఉంటుంది. లైన్‌మెన్‌ ఇళ్లకు వచ్చి ఫ్యూజులు తీసుకెళ్లాల్సిన పని వుండదు. ఎవరైనా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే స్మార్ట్‌ మీటర్‌ వెంటనే మానిటరింగ్‌ కేంద్రానికి సమాచారం పంపుతుంది. దీంతో విద్యుత్‌ చౌర్యాన్ని వెంటనే అరికట్టడమే కాకుండా సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకుంటారు. విద్యుత్‌ సరఫరా నిచిలిపోతే ఎక్కడ, ఎందుకు సరఫరా నిలిచిపోయిందో స్మార్ట్‌మీటర్‌ ద్వారా వెంటనే మానిటరింగ్‌ కేంద్రానికి సంకేతాలు వస్తాయి. సిబ్బంది నేరుగా అక్కడకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు.

ఇదిలావుండగా రెండో దశలో గృహ వినియోగ విద్యుత్‌ కనెక్షన్లకు కూడా స్మార్ట్‌మీటర్లు బిగిస్తారు. అనంతరం విద్యుత్‌ బిల్లుల చెల్లింపును మొబైల్‌ ఫోన్ల తరహాలో ప్రిపెయిడ్‌ రీచార్జీని అమలు చేస్తారు. ప్రస్తుతం ప్రతి నెలా విద్యుత్‌ సిబ్బంది మీటర్‌ రీడింగ్‌ తీసిన తరువాత పక్షం రోజుల్లో బిల్లు చెల్లించే వెసులుబాటు వుంది. స్మార్ట్‌ మీటర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన తరువాత వినియోగదారులు ముందుగానే కార్డు ద్వారా డబ్బులు చెల్లించాలి. వినియోగించిన విద్యుత్‌కు సరిపడ డబ్బులు అయిపోతే వెంటనే రీచార్జి చేసుకోవాలి.

Updated Date - Nov 22 , 2024 | 12:50 AM