Share News

ఉక్కు కార్మికులకు అందని జీతాలు

ABN , Publish Date - Dec 15 , 2024 | 01:34 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఉక్కు కార్మికులకు అందని జీతాలు

  • సెప్టెంబరు నెల జీతం 50 శాతం, అక్టోబరు నెల జీతం 35 శాతం పెండింగ్‌

  • డిసెంబరు 15 తేదీ వచ్చినా నవంబరు జీతం ఊసే లేదు

  • డిప్యుటేషన్‌పై వచ్చిన వారికి మాత్రం సకల సౌకర్యాలు

  • ఆ ముగ్గురికి అన్ని వసతులతో జీతాలు

  • ఫైనాన్స్‌ ఓఎస్‌డీకి 5 స్టార్‌ హోటల్‌లో బస

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా, వివిధ సంస్థల నుంచి ఇక్కడికి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉన్నతాధికారులకు మాత్రం సకల సౌకర్యాలు కల్పిస్తోంది.

ఫైనాన్స్‌ విభాగానికి ఎన్‌ఎండీసీ నుంచి ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా వచ్చిన మహిళా అఽధికారిణి నగరంలోని ఐదు నక్షత్రాల హోటల్‌లో బస చేస్తూ, రోజూ ఇన్నోవా కారులో సిటీ నుంచి స్టీల్‌ప్లాంటుకు రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో ఇలాంటివి నడిచేవి. నష్టాలు ఎక్కువైన తరువాత అనవసర ఖర్చులు వద్దని తీర్మానం చేశారు. ఉద్యోగులకు అన్ని రకాల అలవెన్సులు రద్దు చేశారు. స్టీల్‌ప్లాంటుకు ప్రత్యేకంగా గెస్ట్‌ హౌస్‌లు ఉన్నందున ఎవరైనా ఉన్నతాధికారులు వస్తే అక్కడే బస చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి విరుద్ధంగా ఓఎస్‌డీ కొద్దిరోజులు నోవాటెల్‌లో ఆ తరువాత పార్క్‌ హోటల్‌లో ఉంటున్నారు. వీటికి రోజుకు ఎలా లేదన్నా రూ.10 వేలు అద్దె చెల్లించాలి. ఇన్నోవా కారుకు మరో రూ.5 వేలు కట్టాలి. అంటే ఆ అధికారిణికి రోజువారీ ఖర్చే రూ.15 వేలు. దుబారా ఖర్చులు తగ్గించాలని నీతి వచనలు చెప్పిన ఉన్నతాధికారులు వీటిని ఎలా ఆమోదిస్తున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఉన్నతాధికారులు అందించిన ముడి పదార్థాలతో ప్రతికూల పరిస్థితుల్లోను అత్యధిక ఉత్పత్తిని సాధిస్తున్న కార్మికులకు నెలవారీ జీతాలు ఇవ్వడానికి యాజమాన్యం మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. గత కొద్దికాలంగా రెండు బ్లాస్ట్‌ ఫర్నేసుల ద్వారా రోజుకు 14 వేల టన్నుల ఉత్పత్తి తీస్తున్నారు. ఇది 110 శాతం ఉత్పత్తి. సామర్థ్యానికి మించి పనిచేస్తున్నా కార్మికులు, ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. సెప్టెంబరు నెల జీతం 50 శాతం, అక్టోబరు నెల జీతం 35 శాతం పెండింగ్‌ పెట్టారు. నవంబరు నెల జీతం డిసెంబరు మొదటి వారంలోనే ఇవ్వాలి. కానీ సగం నెల గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. స్టీల్‌ప్లాంటుకు ఎంఓఐఎస్‌ నుంచి డిప్యుటేషన్‌పై సీఎండీగా సక్సేనా వచ్చిన తరువాత ఇలాంటి దుర్భరమైన పరిస్థితి వచ్చిందని ఉద్యోగ, కార్మిక సంఘ నాయకులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. ఇక్కడి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్న సీఎండీ తాను మాత్రం ఎంఓఐఎల్‌ నుంచి ఒకటో తేదీనే జీతం అందుకుంటున్నారు. అలాగే ఓఎస్‌డీ ఇక్కడ అన్ని వసతులు పొందుతూ, అటు ఎన్‌ఎండీసీ నుంచి జీతం తీసుకుంటున్నారు. కానీ రెక్కలు ముక్కలు చేసుకుని అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేస్తున్న కార్మికులు మాత్రం జీతాలు సరిగా అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. పదిహేనో తేదీ వరకూ జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఉద్యోగులు, కార్మికులు వాపోతున్నారు. ఈ సమస్యను కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి దృష్టికి విశాఖ ఎంపీ శ్రీభరత్‌ తీసుకువెళ్లినా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. జీతాలు ఇవ్వడానికే ఏడిపిస్తున్న కేంద్ర పెద్దలు ప్లాంటును నష్టాల నుంచి గట్టెక్కిస్తామంటే ఎలా నమ్మాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

18న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ధర్నా

ఉక్కుటౌన్‌షిప్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):

జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ ప్లాంటు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో ఈ నెల 18న ధర్నా చేపట్టనున్నట్టు పోరాట కమిటీ నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అడ్మిన్‌ కార్యాలయ భవనం ముందు ఈ ధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. ధర్నాలో ఉద్యోగుల కుటుంబ సభ్యులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంటు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని, కర్మాగారాన్ని సెయిల్‌లో విలీనం చేయాలని పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 15 , 2024 | 01:34 AM