Share News

అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:07 PM

అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సాంస్కృతిక విభాగం సంయుక్త కార్యదర్శి నండూరి ఉమ అన్నారు.

అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
అల్లూరి దాడి చేసిన చింతపల్లి పోలీసు స్టేషన్‌ని పరిశీలిస్తున్న సంయుక్త కార్యదర్శి ఉమ

కేంద్ర సాంస్కృతిక విభాగం సంయుక్త కార్యదర్శి నండూరి ఉమ

లంబసింగి, లంకవీధిల్లో పర్యటన

కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళికలు

త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం

గంటందొర వారసులకు నిర్మిస్తున్న గృహ సముదాయం పరిశీలన

బోడిదొర కుటుంబీకులకు పరామర్శ

చింతపల్లి/కొయ్యూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సాంస్కృతిక విభాగం సంయుక్త కార్యదర్శి నండూరి ఉమ అన్నారు. శుక్రవారం చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో ఆమె పర్యటించారు. పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌తో కలిసి ఆమె లంబసింగి స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం, అల్లూరి సీతారామరాజు దాడి చేసిన పోలీస్‌ స్టేషన్‌, లంబసింగి ఘాట్‌, శిథిలమైన రుథర్‌ఫర్డు అతిథి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాటం సాగించిన ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆయన చరిత్రను భావితరాలకు అందించనున్నామన్నారు. అల్లూరి స్మారక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, వీటిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు. త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. అలాగే పర్యాటక ప్రాజెక్టుల్లో అల్లూరి స్మారక ప్రాంతాలను సందర్శక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పీవోను సూచించారు.

అలాగే కొయ్యూరు మండలం బట్టపణుకుల పంచాయతీ లంకవీధి గ్రామంలో క్షత్రియ పరిషత్‌ గంటందొర వారసుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాన్ని కేంద్ర సాంస్కృతిక విభాగం సంయుక్త కార్యదర్శి నండూరి ఉమ పరిశీలించారు. ఈ గృహసముదాయం పూర్తి కావచ్చిందని, త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ గృహాలకు విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేయించాలని తహసీల్దార్‌ ప్రసాద్‌ను ఆదేశించారు. అనంతరం ఇటీవల మరణించిన గంటందొర మనుమడు బోడిదొర కుటుంబీకులను పరామర్శించారు. ఆమె వెంట క్షత్రియ సంఘం ఉమ్మడి రాష్ట్రాల కార్యదర్శి నడింపల్లి శ్రీనుబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పి. రఘు, ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, చంటిబాబు, రాధాకృష్ణంరాజు, సుబ్రహ్మణ్య రాజు, జడ్‌పీటీసీ మాజీ సభ్యుడు తారక వేణగోపాల్‌, డీటీ కుమారస్వామి ఉన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 10:07 PM