Share News

ఇసుక డిపోలపై తర్జనభర్జన

ABN , Publish Date - Jul 09 , 2024 | 01:01 AM

రాష్ట్రంలో అత్యధికంగా ఇసుక వినియోగించే నగరం విశాఖపట్నం. అటువంటిచోట స్థానికంగా ఇసుక లభ్యమయ్యే పరిస్థితి లేదు.

ఇసుక డిపోలపై తర్జనభర్జన

జిల్లాలో రీచ్‌లు లేకపోవడంతో ఇటు శ్రీకాకుళం, అటు రాజమండ్రి నుంచి తెచ్చుకోవలసిన పరిస్థితి

అందుకోసం డిపోలు ఏర్పాటు

అగనంపూడి, భీమిలిల్లో ఇప్పటికీ కొనసాగింపు

ప్రస్తుతం అక్కడ నుంచే సరఫరా

రానున్న రోజుల్లో నిర్వహణపై స్పష్టత కరవు

ఒక్కో డిపోకు 20 మంది సిబ్బంది అవసరం

విశాఖపట్నం, జూలై 8 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో అత్యధికంగా ఇసుక వినియోగించే నగరం విశాఖపట్నం. అటువంటిచోట స్థానికంగా ఇసుక లభ్యమయ్యే పరిస్థితి లేదు. పొరుగు జిల్లాల నుంచి తీసుకురావల్సిందే. అయితే ఉచితంగా ఇసుక సరఫరాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ దూరంగా ఉన్న గోదావరి, వంశధార, నాగావళి నదుల నుంచి ఇసుక విశాఖ తీసుకువచ్చి ప్రజలకు ఉచితంగా సరఫరా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి తీసుకువచ్చిన ఇసుకను ప్రజలకు సరసమైన ధర (రవాణా వ్యయం, పన్నులు)కు విక్రయించేందుకు డిపోలు అవసరం. ప్రస్తుతం జిల్లాలో రెండు డిపోలు ఉన్నా వాటిని నిర్వహించే యంత్రాంగం లేదు. ఈ పరిస్థితుల్లో డిపోలు నిర్వహణ ఎలాగో అధికారులకు అర్థం కావడం లేదు.

గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో దశల వారీగా ఎనిమిది డిపోలు ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుక అమ్మకాలు జరిపారు. అయితే మధ్యలో డిపోల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో ఇసుక సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఇసుక తవ్వకాల కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు, గనుల శాఖ మధ్య సమన్వయం లేకపోవడంతో చిన్నపాటి నిర్మాణదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. బల్క్‌గా ఇసుక కావాలనుకునే బిల్డర్లు, పెద్ద కాంట్రాక్టర్లు గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో రీచ్‌లకు వెళ్లాల్సి వచ్చింది. తక్కువ మొత్తం అవసరమైనవారు నగరంలో ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లి ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేశారు. ఇదే సమయంలో కొందరు వ్యాపారులు ఒడిశా నుంచి ఇసుక తెచ్చి నగరంలో టన్ను రూ.1,200 నుంచి రూ.1,400 వరకు అమ్మకాలు జరిపారు.

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఇసుక విధానంపై కీలక నిర్ణయం తీసుకుని ఉచితంగా సరఫరా ప్రారంభించారు. దీని ప్రకారం రీచ్‌ల వద్ద అయితే ఒకరికి రోజుకు ఉచితంగా 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తారు. అయితే పలు రకాల పన్నుల కింద టన్నుకు రూ.260 చెల్లించాల్సి ఉంటుంది. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో నిర్మాణదారులకు ఇబ్బంది ఉండదు. సమస్య అంతా విశాఖ జిల్లాలోనే. ఇటు గోదావరి, అటు వంశధార, నాగావళి నదుల నుంచి ఇసుక విశాఖ జిల్లాకు తీసుకువచ్చి నిర్ణీత ధరకు విక్రయించాలంటే డిపోలు కొనసాగించాలి. ప్రస్తుతం జిల్లాలో అగనంపూడి, భీమిలి డిపోల్లో గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు తీసుకువచ్చిన 1.9 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. అది రెండు, మూడు నెలల వరకు సరిపోతుందని అంచనా వేస్తున్నారు. టన్ను ఇసుక అగనంపూడిలో రూ.1,394, భీమిలిలో రూ.758కు సోమవారం నుంచి విక్రయాలు ప్రారంభించారు. ఆ ఇసుక విక్రయించిన తరువాత డిపోలు కొనసాగిస్తారా?, లేదా?...అన్నది ఇంకా తెలియడం లేదు. రెండు డిపోలు నిర్వహించాలంటే ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలి. ఒక డిపో నిర్వహించాలంటే కనీసం 20 మంది సిబ్బంది ఉండాలి. గోదావరి, వంశధార, నాగావళి నదుల్లోని రీచ్‌ల వద్ద కూడా కొంతమంది సిబ్బంది ఉండాలి. అయితే ఏపీఎండీసీ వద్ద అంత సిబ్బంది లేరు. జిల్లా గనుల శాఖలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీరంతా రెగ్యులర్‌ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోనీ గ్రామ/వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా డిపోల నిర్వహణ, రవాణా తదితర విధులు చేపట్టాలన్నా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి కొంతమంది సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా ఇసుక రవాణా, డిపోల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల నిర్వహణ చేయవచ్చు. చిన్న చిన్న అవసరాలకు ఇసుక కావాలనుకునే వారంతా రీచ్‌లకు వెళ్లి తెచ్చుకోవడం సాధ్యం కాదని, అందువల్ల విశాఖ జిల్లాలో డిపోలు కొనసాగించడం అవసరమని సీనియర్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అందుకు రెండు, మూడు నెలలు పట్టవచ్చునన్నారు.

ప్రైవేటుగా అమ్మకాలు నిషేధం

ఇదిలావుండగా ఉచిత ఇసుక విధానం అమలు నేపథ్యంలో నగరం, పరిసరాల్లో ప్రైవేటుగా ఇసుక అమ్మకాలు నిషేధించారు. అనధికారికంగా ఇసుక విక్రయిస్తే భారీగా జరిమానా విధిస్తారు.

రేటు తగ్గే అవకాశం?

ప్రస్తుతం అగనంపూడిలో ఇసుక టన్ను రూ.1,394, భీమిలిలో రూ.758గా నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో రీచ్‌ల వద్ద టన్నుకు రూ.475 చెల్లించి నగరానికి కాంట్రాక్టర్లు ఇసుక తీసుకువచ్చారు. అక్కడ పన్నులు, రవాణా ఖర్చులు పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ధర నిర్ణయించామని అధికారులు వివరించారు. డిపోల్లో అందుబాటులో ఉన్న ఇసుక అమ్మకాలు తరువాత ధర కొంత వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. టన్నుకు రూ.200 వరకు తగ్గే అవకాశం ఉందని, అయితే దీనిపై మరింత స్పష్టత రావల్సి ఉందన్నారు.

భీమిలి డిపోలో ఇసుక సరఫరా ప్రారంభం

విశాఖపట్నం, జూలై 8 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని భీమిలి డిపో నుంచి సోమవారం ఇసుక సరఫరాను ఆర్డీవో భాస్కరరెడ్డి, జిల్లా గనుల శాఖ అధికారి డీఈఎస్‌ఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుకను వంశధార నది నుంచి భీమిలి డిపోకు తీసుకువచ్చారు. అందుకే సీనరేజ్‌, ఇతర పన్నులు, రవాణా ఖర్చులు కలిపి టన్నుకు రూ.758 వసూలు చేస్తున్నారు. తొలి రోజు 20 టన్నులు విక్రయించారు. ఇకపై ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇసుక అమ్మకాలు కొనసాగించనున్నారు. గోదావరి నది నుంచి ఇసుక తీసుకురావడంతో అగనంపూడి డిపో వద్ద టన్ను రూ.1394కు అందిస్తున్నారు. ప్రస్తుతం అగనంపూడి డిపోలో 97,782.36 టన్నులు, భీమిలిలో 94,047 టన్నులు...మొత్తం 1,91,826.36 టన్నులు ఇసుక అందుబాటులో ఉంది.

అగనంపూడి డిపోలో ఏర్పాట్లు

అగనంపూడి, జూలై 8:

అగనంపూడి డిపో నుంచి ఇసుక సరఫరాకు సోమవారం అధికారులు ఏర్పాట్లుచేశారు. రీచ్‌లలో లోడింగ్‌, ట్రాన్స్‌పోర్టు చార్జీలతో పాటు డిపోల వద్ద అన్‌లోడింగ్‌, లోడింగ్‌ చార్జీలు, పన్నులతో కలిపి టన్ను ఇసుక ధర రూ.1,394గా నిర్ణయించారు. రోజుకొక వ్యక్తికి 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయనున్నారు. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపితే ఇసుక సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. కాగా తొలిరోజు ఎవరూ ఇసుక తీసుకువెళ్లలేదని డిప్యూటీ తహసీల్దార్‌, ఇసుక డిపో ఇన్‌చార్జి అశోక్‌ తెలిపారు.

Updated Date - Jul 09 , 2024 | 01:01 AM