3 నెలల్లో టీసీఎస్
ABN , Publish Date - Nov 22 , 2024 | 01:07 AM
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సంస్థ (టీసీఎస్) మూడు నెలల్లో విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు.
అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ వెల్లడి
ఐటీ రంగంపై చర్చ సందర్భంగా ప్రకటన
పరిశ్రమ సమస్యలపై గళమెత్తిన జిల్లా ఎమ్మెల్యేలు
ఐటీ పార్కులో మౌలిక వసతులు కల్పించండి: గంటా
పెద్ద కంపెనీలను తీసుకురండి: వంశీకృష్ణ
స్టార్టప్ విలేజ్‌లో కంపెనీలను వైసీపీ ప్రభుత్వం గెంటేసిందన్న విష్ణుకుమార్‌రాజు
అసెంబ్లీ సమావేశాలు ముగిశాక రాయితీలు విడుదల చేస్తామన్న మంత్రి
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సంస్థ (టీసీఎస్) మూడు నెలల్లో విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు. విశాఖపట్నంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీలో గళమెత్తారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో మిలీనియం టవర్లు, స్టార్టప్ విలేజీ భవనాలు ఖాళీగా ఉంచారని, హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం వంటివి వ్యాపారాలు మానుకున్నాయని అన్నారు. ఐటీ కంపెనీలు ఉన్న రుషికొండ ప్రాంతం సాయంత్రం ఆరు దాటితే నిర్మానుష్యంగా మారిపోతున్నదన్నారు. రహదారులు, 24/7 విద్యుత్, మంచినీటి సదుపాయం, తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. టీసీఎస్‌ను నిర్ణీత గడువులోగా తీసుకురావాలని, ఐటీ కంపెనీలకు పెండింగ్‌లో ఉన్న రాయితీలను విడుదల చేయాలని కోరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు జీతాలు ఇచ్చే ఐటీ కంపెనీలు ఉన్నాయని, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో రూ.50 వేలు ఇస్తున్నారన్నారు. అలాంటి పెద్ద కంపెనీలను విశాఖపట్నానికి తీసుకురావాలని కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్‌టీపీఐ కేంద్రం ఏర్పాటుకు రూ.40 కోట్లు ఇస్తామని ముందుకువస్తే గత ప్రభుత్వం ఎకరా భూమి ఇవ్వలేకపోయిందన్నారు. మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం నిక్సీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. స్టార్టప్ విలేజ్‌లో 150 కంపెనీలు ఉంటే వైసీపీ ప్రభుత్వం వారిని బయటకు గెంటేసిందన్నారు. రెంటల్ పాలసీకి స్పందించి అనేక కొత్త కంపెనీలు వస్తే వారికి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైటెక్ సిటీగా అభివృద్ధి చేసినట్టు, విశాఖను లోకేశ్ ఐటీ రంగంలో అభివృద్ధి చేయాలని కోరారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ విశాఖపట్నాన్ని డేటా సెంటర్ల హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ప్రకటించామని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఐటీ కంపెనీలకు రాయితీల కోసం రూ.500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో కూడా ఐటీకి కో వర్కింగ్ స్పేస్ అందుబాటులోకి తేవడానికి యత్నాలు జరుగుతున్నాయన్నారు.
ప్రసాదరెడ్డి అక్రమాలపై విచారణ చేపట్టాలి
ఆయన హయాంలో అవినీతి, అక్రమాలకు నిలయంగా ఏయూ
అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రసాదరెడ్డి గడిచిన ఐదేళ్లలో సాగించిన అడ్డగోలు వ్యవహారాలపై విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీ అవినీతి, అక్రమాలకు కేంద్ర బిందువు మారిందని, దీనికి ప్రసాదరెడ్డే కారణమని పేర్కొన్నారు. వర్సిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెనేట్ హాల్‌లో రాజకీయ నాయకుల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారని, జీవీఎంసీ ఎన్నికల్లో అధికార వైసీపీ తరపున అభ్యర్థులను వర్సిటీలో కూర్చుని ఆయనే ఎంపిక చేశారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కాలేజీల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించారని, వీటన్నింటిపై విచారణ నిర్వహించాలని స్పీకర్‌ను పల్లా కోరారు. అలాగే పాస్టర్‌గా ఉన్న లెక్చరర్‌ను వర్సిటీకి తీసుకువచ్చి రిజిస్ర్టార్‌గా బాధ్యతలను అప్పగించారన్నారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారిని గైడ్లుగా పెట్టి సీనియర్ ప్రొఫెసర్లను అవమానించారన్నారు. రూసా పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. ఏయూలో రెగ్యులర్ ప్రొఫెసర్లను పక్కనపెట్టి ఎయిడెడ్ కాలేజీల నుంచి లెక్చరర్లను తెచ్చి ప్రొఫెసర్లుగా నియమించి సొంత సైన్యాన్ని తయారుచేసుకున్నారని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో వర్సిటీని ఆయన భ్రష్టుపట్టించిన తీరుపై పత్రికలు కథనాలు ప్రచురించాయన్న పల్లా శ్రీనివాసరావు...ఆ వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వర్సిటీకి సంబంధించిన కీలక దస్ర్తాలను మాయం చేశారని, వీటన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.