కోడి వ్యర్థాల కాంట్రాక్టు కోసం పట్టు
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:11 AM
నగరంలోని చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించే కాంట్రాక్టును తమ అనుచరులకు ఇవ్వాలని జీవీఎంసీ అధికారులపై కొందరు ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాల సేకరణకు జోన్‌ల వారీగా టెండర్లు పిలిచిన జీవీఎంసీ
వాటిని కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించకుండా చేపల చెరువులకు అమ్ముకుంటున్న కాంట్రాక్టర్లు
బాగా లాభసాటిగా ఉండడంతో ఈసారి పెరిగిన పోటీ
తమ అనుచరులకు టెండర్ ఖరారు చేయాలని జీవీఎంసీ అధికారులకు ప్రజా ప్రతినిధులు ఫోన్లు
ఏం చేయాలో దిక్కుతోచక నెల రోజులుగా బిడ్ తెరవని వైనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలోని చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించే కాంట్రాక్టును తమ అనుచరులకు ఇవ్వాలని జీవీఎంసీ అధికారులపై కొందరు ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారు. చికెన్ వ్యర్థాలను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించేందుకు జీవీఎంసీ టెండర్లు పిలిచింది. అర్హత, ఆసక్తి కలిగిన పలువురు బిడ్‌లు దాఖలు చేశారు. అర్హత కలిగి తక్కువకు కోట్ చేసిన వారికి టెండర్ ఖరారు చేయాలని అధికారులు భావించారు. కానీ కాంట్రాక్టును తమ అనుచరులకే ఇవ్వాలంటూ నగరంతోపాటు అనకాపల్లి జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పట్టుబడుతున్నారు. దీంతో అధికారులు తాత్కాలికంగా టెండర్లను పక్కనపెట్టారు.
నగర పరిధిలోని చికెన్/మటన్ దుకాణాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఆరుబయట పడేస్తే ప్రజలను రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ప్రజారోగ్యం విభాగం సిబ్బంది స్వయంగా దుకాణాలకు వెళ్లి చికెన్ వ్యర్థాలను సేకరించి కాపులుప్పాడ తరలించేవారు. అయితే పారిశుధ్య నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో టెండర్ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా ఇదే పద్ధతి అమలవుతోంది. రెండేసి జోన్లను ఒక యూనిట్‌గా తీసుకుని ఆయా ప్రాంతాల్లోని చికెన్ దుకాణాల నుంచి ప్రతిరోజూ వ్యర్థాలను సేకరించి, వాటిని వారి సొంత వాహనాల్లో డంపింగ్ యార్డుకు తరలించేందుకు వీలుగా టెండర్లు పిలిచి తక్కువకు కోట్ చేసేవారికి పనులు అప్పగిస్తూ వస్తోంది. ఇదిలావుండగా అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో చేపల చెరువులు పెరగడంతో చికెన్ వ్యర్థాలకు డిమాండ్ పెరిగింది. చికెన్ వ్యర్థాలను ఆహారంగా వేస్తే తక్కువ వ్యవధిలోనే చేపలు ఎక్కువ బరువు పెరుగుతాయని పెంపకందారులు వాటి కోసం పోటీపడడం మొదలెట్టారు. ఇది నగరంలో చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించే కాంట్రాక్టు పొందినవారికి వరంగా మారింది. కాపులుప్పాడలోని యార్డుకు తరలించకుండా, జీవీఎంసీ అధికారులను మేనేజ్ చేసుకుని వ్యర్థాలను నేరుగా చేపల చెరువులకు తరలించడం ప్రారంభించారు. దీనివల్ల చికెన్ వ్యర్థాలను సేకరించే కాంట్రాక్టర్లకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. చికెన్ వ్యర్థాలను సేకరించేందుకు జీవీఎంసీ అప్పగించిన కాంట్రాక్టు గడువు ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగియడంతో కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఆగస్టులో జోన్‌ల వారీగా ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలిచింది. సెప్టెంబరు ఆరున టెండర్లు తెరిచి అర్హులైన వారికి పనులు అప్పగిస్తామని నోటీసులో పేర్కొంది. అయితే టెండర్ నోటిఫికేషన్ విషయం తమకు తెలియలేదు కాబట్టి, గడువు పెంచాలంటూ కొంతమంది కార్పొరేటర్లు జీవీఎంసీ కమిషనర్‌ను కోరారు. దీంతో అక్టోబరు ఐదు వరకూ టెండరు దాఖలుకు అవకాశం కల్పించారు. ఆరున టెండర్లు తెరుస్తామని ప్రకటించారు.
ప్రజా ప్రతినిధుల జోక్యంతో ఆగిన ప్రక్రియ
కోడి వ్యర్థాల సేకరణ కాంట్రాక్టు దక్కితే భారీగా సంపాదించవచ్చునని భావించి టెండర్‌లో పాల్గొన్నవారు కొందరు నగరంతోపాటు అనకాపల్లి జిల్లాలో తమకు తెలిసిన నేతలను కలిసి తమకు దక్కేలా చూడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ప్రజా ప్రతినిధులు జీవీఎంసీ అధికారులకు ఫోన్ చేసి చికెన్ వ్యర్థాల కాంట్రాక్టు తాము సూచించిన వారికి వచ్చేలా చూడాలని ఆదేశిస్తున్నారు. నగరానికి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు, మరొక మాజీ ప్రతినిధి నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి తాము చెప్పినవారికి కనీసం ఒక్కో జోన్ కాంట్రాక్టు దక్కేలా చూడాలని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. రూరల్ జిల్లాకు చెందిన మరో ప్రజా ప్రతినిధి కూడా జీవీఎంసీ అధికారులకు ఫోన్ చేసి చాలాకాలంగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి చికెన్‌వ్యర్థాల సేకరణకు టెండర్ వేశారని, కచ్చితంగా ఒక జోన్ ఆయనకు ఇప్పించాల్సిందేనని చెప్పినట్టు సమాచారం. అయితే నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ఖరారు చేస్తే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికారులు భయపడుతున్నారు. అందుకే గత నెల ఆరున తెరవాల్సిన టెండర్లను ఇంతవరకూ తెరవకుండా పక్కనపెట్టేశారు. ఈ విషయం ఒక అధికారి వద్ద ప్రస్తావించగా, ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని, ఏం చేయాలో దిక్కుతోచక ముందుకు వెళ్లడం లేదని సమాధానం ఇచ్చారు.