తాత్కాలిక షెడ్లతో తంటాలు
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:24 PM
మన్యంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల వద్ద గిరిజన నిరుద్యోగులు ఉపాధి పొందేందుకు తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే తాత్కాలిక షెడ్లు కావడంతో ఈదురుగాలులు వీచినా, వర్షం పడినా షెడ్లు కూలిపోతున్నాయి.
పర్యాటక ప్రాంతాల్లో కర్రలతో షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్న గిరిజన యువత
ఈదురుగాలులు, వర్షాలకు కూలిపోతున్న వైనం
శాశ్వత షెడ్లు నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరినా ఫలితం శూన్యం
అనంతగిరి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మన్యంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల వద్ద గిరిజన నిరుద్యోగులు ఉపాధి పొందేందుకు తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే తాత్కాలిక షెడ్లు కావడంతో ఈదురుగాలులు వీచినా, వర్షం పడినా షెడ్లు కూలిపోతున్నాయి. దీంతో వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శాశ్వత షెడ్లు నిర్మించాలని గతంలో పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు.
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రా, కటికి, తాటిగుడ, కాఫీ ప్లాంటేషన్ వద్ద గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు చికెన్ కబాబులు, బేంబూ చికెన్, కాఫీ, స్వీట్‌కాన్, ఇతర అటవీ ఉత్పత్తులను విక్రయించడానికి కర్రలతో తాత్కాలిక షెడ్లు వేసుకున్నారు. అయితే బలంగా ఈదురుగాలులు వీచినప్పుడు, భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ షెడ్లు కూలిపోతున్నాయి. వీటిని తిరిగి ఏర్పాటు చేసుకోవడం కష్టంగా ఉంటోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో శాశ్వత షెడ్లు నిర్మించి ఇవ్వాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వీరు మొరపెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం లేదు. దీంతో గిరిజన యువతకు అవస్థలు తప్పడం లేదు. మండలంలోని కాఫీ ప్లాంటేషన్, డముకు వ్యూపాయింట్, కటికి, తాటిగుడ, బొర్రా పర్యాటక ప్రాంతాల్లో కనీసం 5 నుంచి 20 షెడ్లను ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని వారు అంటున్నారు.