ఆ రూ.650 కోట్ల భూమి కాశీవిశ్వేశ్వరునిదే...
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:20 AM
కొన్ని వందల ఏళ్ల క్రితం భక్తురాలు విరాళంగా ఇచ్చిన భూమి ఎట్టకేలకు సింహగిరిపై ఉన్న కాశీవిశ్వేశ్వర పంచాయతన దేవాలయానికి చెందేలా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.
గంగసాని అగ్రహారంలో గల 102 ఎకరాలపై ప్రైవేటు వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
భూమి పత్రాలను ఈవోకు అందజేసిన దేవదాయ శాఖ అసిస్టెంట్ అధికారి
సింహాచలం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):
కొన్ని వందల ఏళ్ల క్రితం భక్తురాలు విరాళంగా ఇచ్చిన భూమి ఎట్టకేలకు సింహగిరిపై ఉన్న కాశీవిశ్వేశ్వర పంచాయతన దేవాలయానికి చెందేలా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సింహాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావు వెల్లడించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సర్వే నంబర్లు 3/1, 3/4లలోని సుమారు 102 ఎకరాలను కాశీ విశ్వేశ్వరునికి ఒకరు విరాళంగా ఇచ్చారు. ఆ భూమిపై 2009లో మేడూరి అప్పలనరసింహమూర్తి అనే వ్యక్తి దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేయగా 2010లో దేవస్థానానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దానిపై 2010లో మరొకసారి అప్పలనరసింహమూర్తి రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. ఆ రిట్ పిటిషన్‌ను ఈనెల ఐదో తేదీన హైకోర్టు కొట్టివేసింది. న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో శుక్రవారం దేవదాయ శాఖ విశాఖ అసిస్టెంట్ కమిషనర్ టి.అన్నపూర్ణ భూమికి చెందిన దస్త్రాలను సింహాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావుకు అందజేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.650 కోట్లు ఉంటుందని ఈఓ ప్రాథమికంగా అంచనా వేశారు. అది మరొకసారి అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, దానిలో ప్రస్తుతం ఉన్న పండ్ల చెట్లను లెక్కగట్టి బహిరంగ వేలం ద్వారా ఫలసాయం అనుభవించేందుకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలో మరికొన్ని భూములను కూడా కోర్టు ఆదేశాలతో స్వాధీనం చేసుకోనున్నట్టు ఈఓ ప్రకటించారు. విలేకరుల సమావేశంలో దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్ డీజీ శ్రీనివాసరాజు, లీగల్‌సెల్ ఏఈఓ రమణమూర్తి, ప్యానల్ న్యాయవాది ఎస్.ఆర్.వర్మ పాల్గొన్నారు.