Share News

అందాలు అమోఘం.. వసతులు శూన్యం

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:31 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి ఈ సీజన్‌లో పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇక్కడ మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి వర్ణనాతీతం.

అందాలు అమోఘం.. వసతులు శూన్యం
లంబసింగి జంక్షన్‌లో పర్యాటకులు(ఫైల్‌)

లంబసింగిలో కనీస సౌకర్యాలు కరువు

మరుగుదొడ్లు లేక పర్యాటకుల అవస్థలు

ఏటా పర్యాటక సీజన్‌కు ముందు ఏర్పాటు చేస్తామని అధికారుల ప్రకటనలు

సీజన్‌ ప్రారంభమైనా చర్యలు చేపట్టని వైనం

మహిళలకు తప్పని ఇబ్బందులు

కనీసం బయో టాయిలెట్లనైనా ఏర్పాటు చేయాలని సందర్శకుల డిమాండ్‌

చింతపల్లి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి ఈ సీజన్‌లో పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇక్కడ మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి వర్ణనాతీతం.

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి వచ్చే సందర్శకులు మల, మూత్ర విసర్జనకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంబసింగి పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా టాయిలెట్స్‌ అందుబాటులో లేవు. దీంతో పర్యాటకులు మల, మూత్ర విసర్జన చేసే పరిస్థితి లేక ఉగ్గపట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొంత మంది పర్యాటకులు కాఫీ తోటల్లోకి వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్నారు. ప్రతి ఏటా సీజన్‌కి ప్రారంభానికి ముందు లంబసింగి పరిసర పర్యాటక ప్రాంతాల్లో రక్షిత మంచినీరు, బయో టాయిలెట్స్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికి కార్యరూపం దాల్చడం లేదు. ప్రస్తుతం పర్యాటక సీజన్‌ ప్రారంభమైనప్పటికి పాలకులు, అధికారులు మరుగుదొడ్లు, రన్నింట్‌ వాటర్‌ సదుపాయాలు కల్పించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగికి ప్రతి ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తున్నారు. దీంతో లంబసింగి పరిసర ప్రాంతాలు రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా లంబసింగి జంక్షన్‌, లంబసింగి, రాజుపాకలు, భీమనాపల్లి, తాజంగి జలాశయం, చెరువులవేనం వద్ద పర్యాటకుల రద్దీ అధికంగా కనిపిస్తుంది. ఓ వైపు మంచు అందాలను అస్వాదిస్తూ పర్యాటకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే పర్యాటకుల సందర్శక ప్రాంతాలైన లంబసింగి జంక్షన్‌, లంబసింగి, రాజుపాకలు, తాజంగి జలాశయం, భీమనాపల్లి పాంతాల్లో ఎక్కడా మరుగుదొడ్లు లేవు. చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద మాత్రమే ఆరు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా మరుగుదొడ్లు అందుబాటులో లేవు. దీంతో పర్యాటకులు మల, మూత్ర విసర్జనకు ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లంబసింగిలో కొంత కాలంగా బయో టాయిలెట్స్‌, ప్రజా మరుగుదొడ్లు నిర్మిస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నప్పటికి ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవడంపై పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మహిళా పర్యాటకుల అవస్థలు

లంబసింగి సందర్శించే పర్యాటకులు మల, మూత్ర విసర్జనకు సైతం సిగ్గు విడిచి తుప్పల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మహిళా పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లంబసింగి రిసార్ట్స్‌లో బస చేసిన పర్యాటకులు అద్దెకు తీసుకున్న గదుల్లోనే కాలకృత్యాలు తీర్చుకుని మంచు అందాలను తిలకించేందుకు వస్తున్నారు. స్థానికంగా బస చేసే పర్యాటకులకు మల, మూత్ర విసర్జన సమస్య పెద్దగా ఉండకపోయినా, మైదాన ప్రాంతాల నుంచి ఉదయం వేళలో లంబసింగి వచ్చే పర్యాటకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లంబసింగిలో పర్యాటకులకు పూర్తి స్థాయిలో సరిపడే వసతి సదుపాయం లేదు. దీంతో మైదాన ప్రాంతాల్లో బస చేసి ఉదయం ఐదు గంటలకు పర్యాటకులు లంబసింగి చేరుకుంటున్నారు. ఇంచుమించు మధ్యాహ్నం, సాయంత్రం వరకు పర్యాటకులు లంబసింగిలో ఉంటున్నారు. దీంతో అధిక సమయం మల, మూత్ర విసర్జనకు వెళ్లకుండా ఉండడం కష్టంగా ఉంది. పురుషులు సులభంగా సమీపంలోఉన్న తప్పుల్లోకి వెళ్లిపోతున్నప్పటికి మహిళల అవస్థలు వర్ణనాతీతం.

ప్రకటనలకే పరిమితం

లంబసింగిలో బయోటాయిలెట్స్‌ ఏర్పాటు ప్రకటనలకే పరిమితమైంది. నాలుగేళ్లుగా లంబసింగి- తాజంగి మార్గంలో, చెరువులవేనంకి వెళ్లే మార్గంలో పలు చోట్ల పర్యాటకుల సౌకర్యార్థం బయోటాయిలెట్స్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు సీజన్‌ ప్రారంభానికి ముందు నుంచి చెబుతున్నారు. అలాగే ప్రజా మరుగుదొడ్లు నిర్మించి రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు బయో టాయిలెట్స్‌, ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం పర్యాటక సీజన్‌ ప్రారంభమైనప్పటికి పర్యాటకులకు కనీస అవసరాలైన మరుగుదొడ్లు, రక్షిత మంచినీటి సదుపాయం కల్పించేందుకు అధికారులు, పాలకులు ఎటుంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇప్పటికిప్పుడు ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం సాధ్యంకాపోయినా కనీసం బయోటాయిలెట్స్‌, వాటర్‌ సదుపాయం కల్పిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పర్యాటకులు చెబుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:31 PM