మురిపించిన మన్యం అందాలు
ABN , Publish Date - Nov 17 , 2024 | 11:46 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ప్రస్తుతం పిక్నిక్‌ల సీజన్ జోరందుకోవడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం మన్యం బాట పట్టారు.
వాతావరణం ఆహ్లాదంగా ఉండడంతో పోటెత్తిన పర్యాటకులు
పర్యాటక ప్రాంతాలన్నీ రద్దీ
జోరందుకున్న పిక్నిక్‌ల సీజన్
చెరువులవేనం, వంజంగి మేఘాల కొండ మంచు అందాలకు ఫిదా
పాడేరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ప్రస్తుతం పిక్నిక్‌ల సీజన్ జోరందుకోవడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం మన్యం బాట పట్టారు. దీంతో ఆదివారం ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాలు కళకళలాడాయి.
ప్రస్తుతం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, కార్తీక మాసం కావడంతో పిక్నిక్‌ల సందడి కనిపించింది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటక సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాలకొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు. దీంతో జిల్లా కేంద్రం పాడేరు, ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయ, శీతల ప్రాంతం చింతపల్లిలోనూ సందడి నెలకొంది.
అరకులోయలో..
అరకులోయ: స్థానిక పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం సందర్శకులతో రద్దీగా కనిపించాయి. అరకులోయ- పాణిరంగిణి మధ్య సన్‌ఫ్లవర్ తోటలో దట్టమైన మంచులో పర్యాటకులు ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు. అలాగే మాడగడ సన్‌రైజ్ హిల్స్ వద్దకు అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. మంచులో థింసా కళాకారుల నృత్యాలు మనోహరంగా కనిపించాయి.
లంబసింగి వద్ద..
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం కావడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో లంబసింగి, చెరువులవేనం వ్యూపాయింట్, తాజంగి జలాశయం వద్ద ఉదయం ఐదు గంటల నుంచే పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద మంచు అందాలను ఆస్వాదిస్తూ సందర్శకులు ఎంజాయ్ చేశారు. మంచు అందాలను కెమెరాలో బంధించేందుకు పోటీ పడ్డారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు, బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపారు. యర్రవరం జలపాతాన్ని అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా కనిపించాయి.
బొర్రాకు పోటెత్తిన పర్యాటకులు
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు ఈ ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలిరావడంతో బొర్రాగుహలు ప్రాంగణం సందడిగా మారింది. 6,978 మంది గుహలను సందర్శించగా, రూ.5.69 లక్షల ఆదాయం వచ్చిందని యూనిట్ మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు.