కూటమిపైౖనే గిరిజనుల ఆశలు
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:25 PM
గత వైసీపీ ప్రభుత్వం పాడేరు అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం మంజూరుచేసిన పనులను కూడా రద్దు చేసింది. రాష్ట్రంలోనే అధిక శాతం మంది గిరిజనులు జీవించే పాడేరుపై కనీసం దృష్టి పెట్టలేదు.
పాడేరు అభివృద్ధిని విస్మరించిన వైసీపీ ప్రభుత్వం
మోదకొండమ్మ ఆలయం అభివృద్ధికి చర్యలు శూన్యం
నిర్మాణానికి నోచుకోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు
పాడేరు మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు రద్దు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వం పాడేరు అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం మంజూరుచేసిన పనులను కూడా రద్దు చేసింది. రాష్ట్రంలోనే అధిక శాతం మంది గిరిజనులు జీవించే పాడేరుపై కనీసం దృష్టి పెట్టలేదు. ఐటీడీఏ ప్రధాన కేంద్రంగా, 2022 ఏప్రిల్ నుంచి జిల్లా కేంద్రంగా గుర్తింపు పొందినప్పటికీ పాడేరు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగానే తయారైంది.
పాడేరు పట్టణంలోని మెయిన్ రోడ్డు విస్తరణపై అనేక ఏళ్లుగా డిమాండ్ ఉంది. దీంతో 2019లో అప్పటి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు మెయిన్ రోడ్డు విస్తరణ అంశాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. మెయిన్‌రోడ్డు విస్తరణతో దినదినాభివృద్ధి చెందుతున్న పాడేరు రూపురేఖలు మారిపోయి ఎంతో సుందరంగా ఉండడంతోపాటు ప్రమాదాలు తగ్గుతాయని వివరించారు. దీంతో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.47 కోట్లు మంజూరు చేసింది. పాడేరులోని అంబేడ్కర్ కూడలి నుంచి మూడు వైపులా ఉన్న అరకులోయ, విశాఖపట్నం, చింతపల్లి మార్గాల్లో మూడేసి కిలోమీటర్లు చొప్పున మధ్యలో డివైడర్‌తో డబుల్ రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పెద్ద గిరిజన జాతరగా పేరొందిన స్థానిక మోదకొండమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం భావించింది. అందుకు అవసరమైన క్షేత్ర పర్యటనలు, పరిశీలనలు పూర్తయ్యాయి. రూ.కోటి వ్యయంతో మోదకొండమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే స్థానిక వెంకటగిరిపై వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి అప్పట్లో అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, మొన్నటి వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన జి.సృజన అప్పట్లో జాయింట్ కలెక్టర్ స్థాయిలో వచ్చి వెంకటగిరిని సందర్శించారు. వెంకటగిరిపై రూ.5 కోట్లతో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ ప్రకటించింది.
వైసీపీ పాలనలో చేసింది శూన్యం
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంగా ఓ ప్రత్యేకత కలిగిన పాడేరును అభివృద్ధి చేసేందుకు మచ్చుకైనా చర్యలు చేపట్టకపోగా, గత ప్రభుత్వం మంజూరు చేసినవి రద్దు చేయడం విశేషం. పాడేరు మెయిన్ రోడ్డు విస్తరణకు రూ.47 కోట్ల మంజూరైనప్పటికీ, పనులు చేపట్టకపోగా ఆ పనినే పూర్తిగా రద్దు చేసింది. దీంతో గత ఆరేళ్లుగా స్థానిక మెయిన్‌రోడ్డు విస్తరణ జరగలేదు. అలాగే మోదకొండమ్మ ఆలయం అభివృద్థి, స్థానిక వెంకటగిరిపై, అరకులోయలో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణాలపై కనీసం దృష్టిసారించలేదు. వీటి సంగతి అలా ఉంచితే, మరే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో గతంలో రెవెన్యూ డివిజన్ కేంద్రమైన పాడేరు 2022లో జిల్లా కేంద్రమైనప్పటికీ కనీస అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు అభివృద్ధిపైనే వైసీపీ సర్కారు దృష్టిసారించలేదంటే, ఇక జిల్లాలో ఇతర, మారుమూల ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కూటమి సర్కారుపైనే గిరిజనుల ఆశలు
జిల్లా కేంద్రమైన పాడేరు అభివృద్ధికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాడేరు అభివృద్ధికి చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో ఇటీవల జరిగిన గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో ప్రకటించడంతోపాటు మోదకొండమ్మ ఆలయం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇటీవల దేవదాయశాఖ మంత్రిని కోరారు. కాగా పాడేరు మెయిన్‌రోడ్డు విస్తరణతోపాటు పార్కును ఏర్పాటు చేయాలని, పట్టణమంతా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.