అక్రమం పక్కా... అధికారులు ఓ లెక్కా!
ABN , Publish Date - Nov 15 , 2024 | 01:10 AM
పెందుర్తి మండలం పురుషోత్తపురం బాలాజీనగర్‌లో ఓ బిల్డర్ రహదారిని ఆక్రమించి గ్రూపు హౌస్ నిర్మిస్తున్నారు.
బాలాజీనగర్‌లో రహదారిని ఆక్రమించి గృహ నిర్మాణం
బరితెగించిన బిల్డర్
పెందుర్తి రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలం పురుషోత్తపురం బాలాజీనగర్‌లో ఓ బిల్డర్ రహదారిని ఆక్రమించి గ్రూపు హౌస్ నిర్మిస్తున్నారు. ఇక్కడి బీఆర్టీఎస్ రహదారికి అతి సమీపంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థ వెనుక బాలాజీ నగర్ కాలనీలో రామా కో-ఆపరేటివ్ సొసైటీ తరపున కొంతమంది ఉద్యోగులు స్థలాలు కొనుగోలు చేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలనీకి వెళ్లే ప్రధాన మార్గంలో 24 అడుగుల వైశాల్యం గల రహదారిని అధికారికంగా లేఅవుట్‌లో చూపించారు. ఆ ప్రకారంగానే నివాసితులు నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల ఓ బిల్డరు రంగ ప్రవేశం చేసి ప్లాట్ నంబరు 33లోని స్థలాన్ని రెండుగా విభజించి నిబంధనలకు విరుద్ధంగా, కనీసం సెట్ బ్యాక్‌లు కూడా వదలకుండా గ్రూపు హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. పనిలో పనిగా ప్రధాన రహదారికి కేటాయించిన 24 అడుగుల వైశాల్యం గల స్థలంలో 8 అడుగులు మేర ఆక్రమించేశారు. ఈ విషయం తెలిసిన కాలనీ వాసులు మూకుమ్మడిగా వెళ్లి అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఒత్తిడి చేశారు. అయినా బిల్డరు లెక్క చేయలేదు. దీంతో కాలనీవాసులు రెండుసార్లు వేపగుంట జోనల్ కార్యాలయంలో జడ్సీ, ప్రణాళికా విభాగం అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అతిక్రమణను ధ్రువీకరిస్తూ, తక్షణమే పనులు నిలిపి వేయాలని ఆదేశించారు. ఇంత జరిగినా బిల్డర్ దర్జాగా నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జడ్సీని వివరణ కోరడానికి ఆంధ్రజ్యోతి ప్రతినిధి యత్నించగా ఆయన అందుబాటులో లేరు.
మద్దిలపాలెంలో అక్రమ నిర్మాణం
సెట్ బ్యాక్స్ విడిచిపెట్టకుండా పనులు
చోద్యం చూస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు
మద్దిలపాలెం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ 23వ వార్డులో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు ఒకలా పొంది వాటికి విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
మద్దిలపాలెంలో దేవి హోమ్స్ ఎదురుగా గల ఇరుకు రోడ్డులో సుమారు 500 గజాల స్థలంలో భారీ భవనం నిర్మిస్తున్నారు. నిబంధనల ప్రకారం 30 అడుగుల రోడ్డులో 600 గజాలలోపు స్థలాల్లో ముందు పది అడుగులు, మిగతా మూడు వైపులా ఆరున్నర అడుగులు మేర సెట్ బ్యాక్స్ విడిచిపెట్టి నిర్మాణం చేపట్టాలి. అదే చిన్న రోడ్డు అయితే ముందు ఇంకా ఎక్కువ స్థలం వదలాల్సి ఉంటుంది. దేవీ హోమ్స్ ఎదురుగా గల రహదారిలో నిర్మాణదారుడు ఒక్క అడుగు సెట్ బ్యాక్ కూడా వదలకుండా నిర్మాణం చేస్తున్నారు. అలాగే బహుళ అంతస్థుల భవనాల చుట్టూ కచ్చితంగా వాహనం తిరిగేంత స్థలం విడిచిపెట్టాలి. పొరపాటున అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఫైర్ ఇంజన్ తిరగడానికి, నివాసులకు రక్షించేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్లాన్ మంజూరుచేస్తారు. అయితే సదరు నిర్మాణదారుడు ఇవేమీ పట్టించుకోకుండా స్థలం మొత్తంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. అడ్డుకోవాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారుడు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆ నిర్మాణానికి కూతవేటు దూరంలోనే సచివాలయం ఉంది. టౌన్‌ప్లానింగ్ కార్యదర్శి అక్రమ నిర్మాణాలను గుర్తించి అధికారుల దృష్టిలో పెట్టాలి. స్థానిక వైసీపీ నాయకుడి అండతోనే స్థల యజమాని దర్జాగా అక్రమ నిర్మాణం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే సచివాలయ సిబ్బంది చూసీచూడనట్టు ఊరుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా జీవీఎంసీ ప్లాన్ కాపీ జెరాక్స్ నిర్మాణం వద్ద ప్రదర్శించాలి. అటువంటిదేమీ లేకుండా నిర్మాణం చేస్తున్నా టౌన్‌ప్లానింగ్ సిబ్బంది చోద్యం చూస్తున్నారు.