Share News

పబ్‌లు,బార్‌ల ఇష్టారాజ్యం

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:08 AM

నగరంలో కొన్ని పబ్‌లు, బార్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

పబ్‌లు,బార్‌ల ఇష్టారాజ్యం

  • అనుమతులు లేకుండానే నిర్వహణ

  • పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలు

విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

నగరంలో కొన్ని పబ్‌లు, బార్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పబ్‌లు, బార్‌లపై వరుసగా ఫిర్యాదులు అందుతుండడంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని పోలీసులను సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. దీంతో 150 మంది 46 బృందాలుగా ఏర్పడి ఆదివారం రాత్రి ఎనిమిది నుంచి రాత్రి 11 గంటల వరకూ 54 పబ్‌లు, బార్‌లలో తనిఖీలు చేశారు. నాలుగు పబ్‌లు/బార్‌లకు అసలు మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతి లేదని ఈ సందర్భంగా గుర్తించారు. అలాగే మూడు పబ్‌లు, బార్‌లకు ఆహార పదార్థాలు విక్రయించేందుకు ఫుడ్‌ కంట్రోల్‌ డిపార్టుమెంట్‌ అనుమతి లేదని, 12 పబ్‌లు/బార్‌లకు పార్కింగ్‌ స్థలం లేదని, 14 పబ్‌లు/బార్‌లకు ఫైర్‌ డిపార్టుమెంట్‌ నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం లేదని, రెండు పబ్‌లు/బార్‌లు సీసీ కెమెరాలు ఏర్పాటుచేయలేదని, మరో మూడు పబ్‌లు/బార్‌లకు సరైన కిచెన్‌ లేదని, గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లను వాడుతున్నారని గుర్తించారు. 12 బార్‌లలో ఎంఆర్‌పీకి మించి మద్యాన్ని విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వారందరిపై చర్యలకు సంబంధిత శాఖలకు నివేదికలు పంపిస్తామని సీపీ తెలిపారు.

Updated Date - Dec 03 , 2024 | 01:08 AM