Share News

ఉక్కును ప్రైవేటీకరించబోమని ప్రధాని ప్రకటించాలి

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:08 AM

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్నం పర్యటనలో ప్రకటించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఉక్కును ప్రైవేటీకరించబోమని ప్రధాని ప్రకటించాలి

కార్మిక సంఘ నాయకుల డిమాండ్‌

విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్నం పర్యటనలో ప్రకటించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశానికి అన్ని సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యారామ్‌ మాట్లాడుతూ, ఈ నెలాఖరున అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ప్లాంటు శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని మోదీ...అనంతరం నిర్వహించే సభలో విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. సెయిల్‌లో విలీనం చేయాలని, పూర్తిస్థాయి ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిపదార్థాలు అందించాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ అధ్యక్షులు ఆదినారాయణ మాట్లాడుతూ, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం ద్వంద్వ వైఖరితో ప్లాంటు సామర్థ్యాన్ని 73 లక్షల టన్నుల నుంచి కుదించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రుణాలపై వడ్దీలు లేకుండా చూడాలని, ఐదేళ్ల వరకు రుణాలు తీర్చాలని ఒత్తిడి పెట్టకూడదన్నారు. ఐఎన్‌టీయూసీ నాయకులు మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ, ప్లాంటు ఆర్థిక మూలాలు దెబ్బతీసే కుట్ర చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వకుండా వీఆర్‌ఎస్‌ తీసుకుని వెళ్లిపోయే పరిస్థితి కల్పిస్తున్నారని ఆరోపించారు. వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, 2021 జనవరి తరువాత వచ్చిన సీఎండీ పరిపాలనలో జరిగిన అవినీతిపై సీఐడీ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎన్‌టీయూసీ నాయకులు బొడ్డు పైడిరాజు, గణపతి రెడ్డి తదితరులు మాట్లాడారు.

Updated Date - Nov 19 , 2024 | 01:08 AM