Share News

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:39 AM

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సేవలో పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు.

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
మరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్‌పీ అమిత్‌బర్థార్‌

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

ఘనంగా పోలీసు అమరవీరుల స్మారక దినం

పాడేరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సేవలో పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తారని, అటువంటి పోలీసులను గౌరవించాలన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు అడుగులు వేస్తున్న పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్థార్‌, కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ చేతుల మీదుగా 12 మంది పోలీసు అమర వీరుల కుటుంబాలకు చెక్కులను అందించారు. అలాగే అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌ ఎస్‌పీ వి.సత్తిరాజు, డీఎస్‌పీ వేణుగోపాల్‌, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు అమరుల కుటుంబ సభ్యులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:39 AM