ప్రాణాలు తీస్తున్న వేగం
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:25 PM
అతివేగం, అవగాహన లేని డ్రైవింగ్, బైక్‌పై విన్యాసాలు యువత ప్రాణాలను బలిగొంటున్నాయి. దీనికి తోడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మండలంలోని పలు ప్రాంతాల్లో గత ఏడాదిగా జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణాలు
ఘాట్‌రోడ్డుపై అవగాహన లేమి
విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత
పోలీసులు అవగాహన కల్పిస్తున్నా తగ్గని ప్రమాదాలు
అనంతగిరి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): అతివేగం, అవగాహన లేని డ్రైవింగ్, బైక్‌పై విన్యాసాలు యువత ప్రాణాలను బలిగొంటున్నాయి. దీనికి తోడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మండలంలోని పలు ప్రాంతాల్లో గత ఏడాదిగా జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది.
మండలంలోని శివలింగపురం నుంచి అనంతగిరి వరకు ఘాట్‌రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మలుపులు ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించే క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, ఘాట్‌రోడ్డుపై అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అలాగే చిలకలగెడ్డ నుంచి శివలింగపురం వరకు రోడ్డు విశాలంగా ఉండడంతో వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. జీనబాడు నుంచి కివర్ల వరకు చిన్నరోడ్డు, మలుపులు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తుమ్మనవలస- గుమ్మకోట వెళ్లే మార్గం కూడా ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
మచ్చుకు కొన్ని..
- గత ఏడాది ఫిబ్రవరి 20న బొర్రా శివరాత్రి జాతరను తిలకించేందుకు ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చారు. తిరుగు ప్రయాణంలో డముకు-నిమ్మలపాడు రోడ్డులోని రాయిపాడు సమీపంలో రక్షణ గోడను ఢీకొని లోయలో పడి వారు మృతి చెందారు.
- అరకు వైపు పర్యాటకులతో వస్తున్న ఓ ట్రావెల్స్ బస్సును గత ఏడాది అక్టోబరు 15న కొత్తూరు గ్రామానికి చెందిన వంతాల మోహన్ అనే యువకుడు ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి అతివేగమే కారణంగా పోలీసులు నిర్ధారించారు.
- విశాఖపట్నం గాజువాకకు చెందిన ఇద్దరు యువకులు ఈ ఏడాది అక్టోబరు 25న ద్విచక్ర వాహనంపై అరకులోయకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో చిలకలగెడ్డ వద్దకు వచ్చే సరికి ఎదురుగా బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న గుమ్మకోట పంచాయతీ గోట్లెపాడుకు చెందిన రమేశ్(17) మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిలకలగెడ్డలో రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదాలు పునరావృత్తం కాకుండా అరకు సీఐ హిమగిరి ఆధ్వర్యంలోని ఎస్‌ఐ శ్రీనివాసరావు స్టాపర్లను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ఘాట్‌రోడ్డు ప్రయాణాలపై అవగాహన కల్పిస్తున్నారు.