Share News

సందడిగా ‘ఇది మంచి ప్రభుత్వం’

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:30 AM

ఎన్టీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తవడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సందడిగా ‘ఇది మంచి ప్రభుత్వం’
కేక్‌ కట్‌ చేస్తున్న హోం మంత్రి అనిత

పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు,

అధికారులు, నాయకులు

ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన

వంద రోజుల ప్రగతిపై ప్రచారం

అనకాపల్లి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎన్టీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తవడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 26వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తొలిరోజు ప్రారంభోత్సవానికి అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులు హాజరయ్యారు. వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్‌ను ఇంటింటికీ అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వంద రోజుల్లో అవ్వా,తాతలకు నెలకు రూ.4 వేలు పింఛన్‌, దివ్వాంగులకు నెలకు రూ.6 వేలు అందిస్తున్నామని వక్తలు తెలిపారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేసి ప్రజల ఆస్తుల భద్రత కల్పించామని పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ప్రకటన, అనేక మంది పేదల ఆకలి తీర్చుతున్న అన్న క్యాంటీన్‌ల ఏర్పాటు జరిగిందన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి ఆదుకున్నామని, వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపడుతోందని వివరించారు. జిల్లాలో తొలిరోజు శుక్రవారం హోం మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట, నక్కపల్లిల్లో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వంద రోజుల పాలనపై మంత్రి కేక్‌ కట్‌ చేశారు. అనకాపల్లి నియోజకవర్గం కశింకోటలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు తదితరులు పాల్గొని వంద రోజుల కూటమి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి వార్డులో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌, మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం మేడిచర్ల గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. అనకాపల్లి మండలం రేబాక గ్రామంలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్‌ విజయకృష్ణన్‌ హాజరై ‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్‌ను మహిళలకు పంపిణీ చేశారు. స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో, జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ దుగ్గాడ గ్రామంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:30 AM