నేడు అనంత పద్మనాభునిదీపోత్సవం
ABN , Publish Date - Nov 30 , 2024 | 01:07 AM
పద్మనాభంలోని అనంత పద్మనాభుని దీపోత్సవం శనివారం నిర్వహించనున్నారు.
సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం
1,286 మెట్లకు ఇరువైపులా దీపాలు వెలిగించనున్న భక్తులు
ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
పద్మనాభం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):
పద్మనాభంలోని అనంత పద్మనాభుని దీపోత్సవం శనివారం నిర్వహించనున్నారు. కొండ దిగువన తొలి పావంచా వద్ద సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజున దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్థలతో నిర్వహిస్తారు. పద్మనాభుని కొండపై వరకు ఉన్న 1,286 మెట్లకు ఇరువైపులా ప్రమిదలలో నూనె వేసి ఒక్కసారిగా దీపాలను వెలిగించడం ప్రత్యేకత. ఉత్సవంలో భాగంగా భక్తులు వేకువ జాము నుంచి గిరి ప్రథమ పావంచా వద్ద పూజలు చేసి, మెట్లకు పసుపు, కుంకుమ బొట్లు పెడుతూ గిరిని అధిరోహించి, అనంతపద్మనాభుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం దీపాలను వెలిగించడానికి మెట్లను రిజర్వు చేసుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు కుంతీ మాధవస్వామి ఆలయంలో ఉన్న ఉభయ దేవేరులతో కూడిన అనంతుడుని వేద పండితులు మంత్రోచ్ఛారణలతో, పల్లకిపై ఊరేగింపుగా ప్రథమ పావంచా వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అధిష్ఠింపజేస్తారు. అనంతరం విశేష అర్చనలు చేసి భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు కొండపై జేగంట కొట్టగానే అప్పటికే మెట్లపై ఏర్పాటుచేసిన నూనె దీపాలను భక్తులు వెలిగిస్తారు. దీపకాంతులతో అనంతుని గిరి దేదీప్యమానంగా వెలుగొందడంతో భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో మునిగి తేలుతారు.
ఉత్సవ నేపథ్యం
పద్మనాభంలోని గిరి ప్రాంతంలో 1939లో అప్పటి విజయనగరం పాలకుడు పూసపాటి అలక్‌నారాయణ గజపతి ఆనతి మేరకు ద్రాక్షారామం నుంచి వచ్చిన చేకూరి సత్యనారాయణరాజు, బుల్లి సత్యనారాయణరాజు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ద్రాక్షారామం హోమగుండంలో లభ్యమైన త్రిపురసుందరీదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి యజ్ఞ, యాగాదులు నిర్వహించేవారు. ఆఖరిరోజున అనంతుని కొండ మెట్ల పంక్తికి దీపోత్సవాన్ని నిర్వహించేవారు. కొంతకాలం తరువాత ఉత్సవం నిలిచిపోయింది. మళ్లీ 1987లో అప్పటి ఆలయ అర్చకులు రాకుధూటి కృష్ణమాచార్యులు (పెదబాబు) సూచనల మేరకు పునఃప్రారంభించారు.
సర్వం సిద్ధం
ఉత్సవానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానుండడంతో 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత భారీ వాహనాలను దారి మళ్లిస్తారు. చిన్నాపురం జంక్షన్, నీలకుండీలు జంక్షన్, మహారాజ్‌పేట జంక్షన్ మీదుగా భక్తులను అనుమతిస్తారు. చిన్నాపురం జంక్షన్ నుంచి వచ్చే కార్లు, బైక్‌లకు జెడ్పీ అతిఽథిగృహం, మామిడి తోట, అర్చకునిపాలెం వద్ద, మహారాజపేట నుంచి వచ్చే వారికి తహసీల్దారు కార్యాలయం, పౌర సరఫరాల శాఖ గిడ్డంగి, స్ర్పింగ్ ఫీల్డు పాఠశాల వద్ద, నీలకుండీలు నుంచి వచ్చే వారికి పద్మనాభం వంతెన, గరానా సత్యనారాయణ ఖాళీస్థలం, చెరకు కాటా వద్ద పార్కింగ్‌కు స్థలాలు ఏర్పాటుచేశారు.