Share News

ఐటీ ఉద్యోగాల పేరిట టోకరా

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:30 AM

విశాఖపట్నంలో కొన్ని ఐటీ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి.

ఐటీ ఉద్యోగాల పేరిట టోకరా

  • రూ.లక్షల్లో వసూలుచేస్తున్న కొన్ని ఐటీ కంపెనీలు

  • ఇటీవల రూ.3 లక్షల వరకూ తీసుకుని బిచాణా ఎత్తేసిన ఓ సంస్థ

  • షూరిటీ పేరిట రూ.3 లక్షలు చెక్కులు తీసుకున్న మరో సంస్థ

  • ఎందుకూ పనికి రారంటూ వేధింపులు

  • ఉద్యోగం మానేస్తామంటే రూ.లక్షలు కట్టాలని డిమాండ్‌

  • పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం శూన్యం

  • యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ సెటిల్‌మెంట్‌

  • ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే...ఆ సంస్థను అనుమానించాల్సిందేనంటును ఐటీ నిపుణలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో కొన్ని ఐటీ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి. ఉద్యోగార్థుల నుంచి డబ్బు దోచుకోవడానికి యత్నిస్తున్నాయి. వాటికి పోలీసులు సహకరిస్తున్నారు. నగరంలోని ఒక పోలీస్‌ స్టేషన్‌లో కొద్దిరోజుల క్రితం ఇలాంటి కేసు ఒకటి సెటిల్‌మెంట్‌ జరిగింది. ఉద్యోగం మానేయడానికి ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షలు చొప్పున యాజమాన్యం ముక్కు పిండి వసూలుచేసింది. ఇది నగరంలో కొత్త ట్రెండ్‌.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం స్లంపులో ఉంది. అందరికీ ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను అదే పరిస్థితి. ఉత్తరాంధ్రాలో బీటెక్‌ చేసి బయటకు వస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. దీనిని కొన్ని కంపెనీలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. ఐటీలో ఉద్యోగాలు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఫలానా కంపెనీ, ఫలానా తేదీన ఇంటర్వ్యూలు అని చెప్పి రప్పించుకుంటున్నాయి. ఉద్యోగం కావాలంటే కంపెనీకి డిపాజిట్‌ కట్టాలంటూ లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకూ కట్టించుకుంటున్నాయి. ఆఫర్‌ లెటర్‌ ఇచ్చి, ఆ తరువాత అడ్రస్‌ లేకుండా పోతున్నాయి. డబ్బులు కట్టినవారు ఇంటర్వ్యూ జరిగిన ఆఫీసుకు వెళ్లి అడిగితే...ఆ ఒక్కరోజుకు వారికి అద్దెకు ఇచ్చామని, అది వారి ఆఫీస్‌ కాదని చెబుతున్నారు. గ్రీన్‌ పార్క్‌ హోటల్‌ సమీపాన పెద్ద భవంతిలో ఈ తరహా మోసం కొద్దినెలల క్రితం జరిగింది. వారి చేతిలో సుమారు 40 మంది వరకు మోసపోయారు. సుమారు రూ.70 లక్షల వరకు వసూలు చేసుకొని ఆ సంస్థ బిచాణా ఎత్తేసింది.

ఉద్యోగం ఇచ్చాక వేధింపులు

నగరంలో ఉన్న ఓ ఐటీ కంపెనీ ఈ ఏడాది మార్చి నెలలో బీటెక్‌ పాసైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించింది. సుమారు 30 మందిని తీసుకుంది. వారికి అన్నీ కలిపి ఏడాదికి రూ.1.8 లక్షల జీతం ఇస్తామని ఆఫర్‌ లెటర్‌ ఇచ్చింది. అంటే నెలకు సుమారు రూ.15 వేల జీతం. ఎటువంటి అనుభవం లేనందున, శిక్షణ ఇవ్వాలి కాబట్టి, అది పూర్తయ్యాక వెళ్లిపోకుండా ఉండడానికి డిపాజిట్‌ కట్టాలని ఒత్తిడి పెట్టింది. కొందరి వద్ద రూ.3 లక్షలు, మరికొందరి వద్ద రూ.6 లక్షలు చొప్పున వారి తల్లితండ్రుల నుంచి అడ్వాన్స్‌ చెక్కులు తీసుకుంది. మూడు నెలల ప్రొబేషన్‌ తరువాత రెగ్యులర్‌ చేస్తామని, అప్పుడు జీతం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. యువతీ యువకులు ఉత్సాహంగా చేరారు. అయితే వారిలో 80 శాతం మందికి ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు. ఏ బాధ్యత అప్పగించలేదు. నెల నెలా జీతం మాత్రం ఇచ్చింది. ఏదైనా పని చెప్పాలని కొందరు కోరితే...‘మీకు ఏమి చేతనవుతుంది? ఏమీ చేయలేరు.’ అంటూ కంపెనీ ప్రతినిధులు ఎగతాళి చేయడం ప్రారంభించారు. తాము చేరి మూడు నెలలు దాటింది కాబట్టి జీతం పెంచాలని నలుగురైదుగురు కోరగా, ‘ఇదే మీకు ఎక్కువ’ అంటూ వెటకారం చేశారు. దాంతో తాము ఉద్యోగం మానేస్తామని, సర్టిఫికెట్లు వెనక్కి ఇవ్వాలని కోరితే వారిని మరింత వేధించడం ప్రారంభించారు. మూడు నెలల ముందు నోటీసు ఇవ్వడంతో పాటు రూ.3 లక్షలు కట్టాలని, అప్పుడే సర్టిఫికెట్లు, అడ్వాన్స్‌ చెక్కులు వెనక్కి ఇస్తామని నిబంధన పెట్టారు. ఇచ్చిన జీతం లక్ష రూపాయలు కూడా లేదని, మూడు లక్షలు ఎందుకు ఇస్తామని అడిగితే, నచ్చింది చేసుకోండి..అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని ఓ ఎమ్మెల్యేను కలిసి జరిగిందంతా వివరించారు. ఆ కంపెనీ తన నియోజకవర్గంలోనే ఉండడంతో ఆ పోలీస్‌ స్టేషన్‌ అధికారికి ఫోన్‌ చేసి, పిల్లలకు న్యాయం చేయాలని సూచించారు. అక్కడ ఈ పంచాయితీ మూడు రోజులు నడిచింది. పిల్లలను, వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించుకొని కింది స్థాయి అధికారి యాజమాన్యానికి వత్తాసు పలికారు. ఈ విషయం మళ్లీ ఎమ్మెల్యేకు చెప్పడంతో, ఆయన స్టేషన్‌ అధికారికి మరోసారి ఫోన్‌ చేశారు. ఒక్కొక్కరు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వడానికి కంపెనీ ప్రతినిధులు ఒప్పుకోకపోవడంతో ఆ ఒప్పందం ప్రకారం ఆ కేసు సెటిల్‌మెంట్‌ చేశారు. డబ్బులు కట్టాకే వారి సర్టిఫికెట్లు వెనక్కి ఇచ్చారు.

ఇలా చేస్తే మోసం చేస్తున్నట్టే..!

- ఏ కంపెనీ అయినా ఉద్యోగం ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయకూడదు. అలా చేస్తే మోసం చేస్తున్నట్టే భావించాలి.

- గ్యారంటీ, డిపాజిట్‌ పేరుతో అడ్వాన్స్‌ చెక్కులు కూడా తీసుకోకూడదు. ఇది క్రిమినల్‌ కేసు కిందకు వస్తుంది. ఇది కూడా మోసమే.

- శిక్షణ ఇచ్చాక ఉద్యోగం ఇస్తామని కొన్ని సంస్థలు చెబుతాయి. ఆ శిక్షణకు డబ్బులు వసూలు చేస్తాయి. ఇలాంటి అంశాల్లో క్లారిటీ అవసరం. అది ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూటా?, ఐటీ కంపెనీయా?...అని ధ్రువీకరించుకోవాలి. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగాలు ఇవ్వని సంస్థలు అనేకం ఉన్నాయి.

Updated Date - Dec 06 , 2024 | 01:30 AM