Share News

పడకేసిన పర్యాటకం

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:14 AM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యాటకం వెలవెలబోతోంది. వైసీపీ ప్రభుత్వం ఒక్క రుషికొండ భవనంపైనే దృష్టి పెట్టి మిగిలిన వాటిని గాలికి వదిలేసింది. టీడీపీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కూడా ఆసక్తి చూపలేదు. కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేసి వదిలేసింది.

పడకేసిన పర్యాటకం

గత ఐదేళ్లుగా గాలికి వదిలేసిన వైసీపీ సర్కారు

టీడీపీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

పెట్టుబడిదారుల సదస్సులో పదికిపైగా ఒప్పందాలు

ఒక్కటి కూడా కార్యరూపం దాల్చని వైనం

అరకులో నిరుపయోగంగా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌, కళావేదిక

అసంపూర్తిగా ఈట్‌ స్ర్టీట్‌, ట్రైబల్‌ హట్స్‌ ప్రాజెక్టులు

విశాఖ, అరకు, భీమిలి ఉత్సవ్‌లకు కూడా చెల్లు చీటీ

నేడు పర్యాటక శాఖా మంత్రి సమీక్ష

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యాటకం వెలవెలబోతోంది. వైసీపీ ప్రభుత్వం ఒక్క రుషికొండ భవనంపైనే దృష్టి పెట్టి మిగిలిన వాటిని గాలికి వదిలేసింది. టీడీపీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కూడా ఆసక్తి చూపలేదు. కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేసి వదిలేసింది.

రాష్ట్రంలో టెంపుల్‌ టూరిజం కేంద్రమైన తిరుపతి తరువాత పర్యాటకులు అత్యధికంగా వచ్చేది విశాఖపట్నం జిల్లాకే. ఇక్కడ అరకులోయ అందాలు, విశాఖ, భీమిలి బీచ్‌ సోయగాలు, బొర్రాగుహలు, లంబసింగి ఆకట్టుకుంటాయి. వైసీపీ హయాంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో విశాఖ కేంద్రంగా పర్యాటక ఒప్పందాలు పదికి పైగా చేసుకున్నారు. అందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. రూ.200 కోట్లతో దేవ్‌ భూమి సంస్థ రోప్‌వే ప్రాజెక్టులు చేపడతామని ఎంఓయూ చేసుకుంది. ఒక్కచోట కూడా రాలేదు. డ్రీమ్‌ వ్యాలీ సంస్థ వేయి కోట్ల రూపాయలతో గోల్ఫ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ, 5 స్టార్‌ రిసార్ట్‌ కడతామని ఒప్పందం చేసింది. కనీసం డీపీఆర్‌ కూడా కాలేదు. మరో సంస్థ రూ.150 కోట్లతో ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపడతామని సంతకాలు చేసింది. అడుగు ముందుకు పడలేదు. ఇంకా రూ.250 కోట్లతో జల విహారాలు, రూ.120 కోట్లతో స్కై టవర్‌, రూ.100 కోట్లతో టన్నెల్‌ అక్వేరియం నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయి. వీటిలో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. పర్యాటక శాఖ ఒప్పందాలు చేసుకోవడానికే పరిమితమై వాటిని పట్టించుకోకుండా వదిలేసింది.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేయకపోవడంతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న అరకులోయ లోని హరితావేలి రిసార్టులో తెలుగుదేశం ప్రభుత్వం సుమారు రూ.రెండున్నర కోట్లతో డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌, ధింసా కళావేదికలను నిర్మించింది. వీటిని అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. కానీ నేటికీ డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ మూతబడే ఉంది. అలాగే కళావేదిక కూడా నిర్వహణ లేక తుప్పలతో నిండిపోయి ఉంది. ఇదిలావుండగా అరకులోయ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫామ్‌కు చెందిన 18 ఎకరాల్లో రూ.7 కోట్లతో ఈట్‌స్ట్రీట్‌, ట్రైబల్‌హట్‌ ప్రాజెక్టులను గత తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. పనులు జోరుగా జరుగుతున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం కొలువు దీరడంతో ఈ ప్రాజెక్టు మూలకు చేరింది. వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత 20 శాతంలోపు జరిగిన పనులను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పనులు నిలిచిపోయాయి. దీంతో ఈట్‌ స్ట్రీట్‌, ట్రైబల్‌ హట్‌లు తుప్పలు, మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా చింతపల్లి మండలం లంబసింగిలో 12 రిసార్ట్స్‌ నిర్మాణానికి టీడీపీ హయాంలో పనులు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో ముక్కుతూ మూలుగుతూ అందులో ఆరు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన ఆరింటికి కనీసం పునాదులు కూడా వేయలేదు. మేఘాలతో అలరించే చెరువులవేనం గ్రామానికి రహదారిని ప్రతిపాదించారు. మట్టి రోడ్డుతో సరిపెట్టేశారు. ఇక అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో గల కొండకర్ల ఆవకు సందర్శకుల సంఖ్య పెరుగుతున్నా మౌలిక వసతులు లేవు.

ఉత్సవ్‌లకు తిలోదకాలు

పర్యాటకులను ఆకర్షించేందుకు అడపాదడపా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉండాలి. తెలుగుదేశం హయాంలో ప్రతి ఏటా డిసెంబరులో విశాఖ ఉత్సవ్‌, భీమిలి ఉత్సవ్‌, అరకు ఉత్సవ్‌లు నిర్వహించేవారు. వైసీపీ హయాంలో ఒకే ఒక ఏడాది నిర్వహించారు. ఆ తరువాత పూర్తిగా ఆపేశారు. వాస్తవానికి ఈ ఉత్సవాలకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తారు. వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.

నేడు పర్యాటక మంత్రి రాక

పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్‌ బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల అధికారులతో సాయంత్రం ఐదు గంటలకు వీఎంఆర్‌డీఏలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఏడు గంటలకు ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో ముచ్చటిస్తారు. రాత్రికి ఇక్కడే బస చేసి గురువారం మూడు జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో పర్యాటక అంశాలపై సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి రాజమండ్రి బయలుదేరి వెళతారు.

Updated Date - Aug 21 , 2024 | 01:14 AM