పర్యాటక ప్రాంతాలు కిటకిట
ABN , Publish Date - Dec 22 , 2024 | 10:48 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు ఆదివారం క్యూ కట్టారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ వీకెండ్ కావడంతో ఆదివారం మన్యంలో ఎక్కడ చూసినా సందర్శకులు దర్శనమిచ్చారు.
వీకెండ్ కావడంతో ఏజెన్సీ బాటపట్టిన జనం
పర్యాటకులతో సందర్శనీయ ప్రాంతాలు రద్దీ
ప్రకృతి అందాలకు పులకరించిన సందర్శకులు
పొగమంచు అందాలకు ఫిదా
పాడేరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు ఆదివారం క్యూ కట్టారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ వీకెండ్ కావడంతో ఆదివారం మన్యంలో ఎక్కడ చూసినా సందర్శకులు దర్శనమిచ్చారు. ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావుడి నెలకొంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఏజెన్సీలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా ఉండడంతో వాటిని తిలకించేందుకు సందర్శనీయ ప్రదేశాలకు విచ్చేస్తున్నారు. ఆదివారం అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియమ్, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పెదబయలు మండలంలో తారాబు జలపాతం, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. దీంతో పర్యాటకులతో పాడేరు, అరకులోయ, లంబసింగి ప్రాంతాలు రద్దీగా మారాయి.
వంజంగి మేఘాల కొండ కిటకిట
పాడేరురూరల్: పాల సముద్రాన్ని తలపించే వంజంగి మేఘాల కొండకు ఆదివారం ప్రకృతి ప్రియులు పోటెత్తారు. వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలివచ్చారు. మైదాన ప్రాంతంలోని వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు పాడేరుకు శనివారం సాయంత్రమే చేరుకున్నారు. పాడేరులో రాత్రి బస చేసిన పర్యాటకులు ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మేఘాల కొండపైకి చేరుకొని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు, భానుడు మంచును చీల్చుకొచ్చే బంగారు వర్ణ కిరణాల అందాలకు ప్రకృతి ప్రియులు, పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. మేఘాల పర్వతంపై వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ చాలకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో పాడేరులోని టిఫిన్, భోజన హోటళ్లు రద్దీగా మారాయి. ప్రధాన రహదారిలో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్‌ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
లంబసింగి అందాలకు ఫిదా
చింతపల్లి: ఆంధ్రకశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం వాతావరణం అనుకూలించడంతో లంబసింగికి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మూడు రోజులుగా అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడడంతో ఇక్కడకు వచ్చిన పర్యాటకులు తీవ్ర నిరాశ చెందారు. శనివారం నుంచి వాతావరణం తెరిపివ్వడం, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టడంతో మంచు అందాలు ఆవిష్కృతమవుతున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులు లంబసింగికి క్యూ కడుతున్నారు. ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో లంబసింగి, చెరువులవేనం వ్యూపాయింట్, తాజంగి జలాశయం రద్దీగా కనిపించింది. వ్యూపాయింట్ వద్ద మంచు అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేశారు. మంచు అందాల వద్ద ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. అలాగే యర్రవరం జలపాతం వద్దకు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు.
చాపరాయి వద్ద సందడి
డుంబ్రిగుడ: ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలు తగ్గడంతో పర్యాటకులు పోటెత్తారు. చాపరాయి జలవిహారి, అంజోడ సిల్క్‌ఫాం పీనరీని సందర్శించారు. చాపరాయిలో పర్యాటకులు సరదాగా జలకాటాలతో సందడి చేశారు. అంజోడ సిల్క్‌ఫాంలో చెట్ల నీడలో సెల్ఫీలు తీసుకుంటూ కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపారు.