Share News

సుంకరమెట్ట కాఫీ తోటల్లో పర్యాటక సొబగులు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:24 PM

మండలంలోని సుంకరమెట్ట కాఫీ తోటల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం చిన్నపాటి వంతెన మాదిరిగా తాటిదుంగలతో కెనాపివాక్‌ను నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే కాఫీ తోటల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

సుంకరమెట్ట కాఫీ తోటల్లో పర్యాటక సొబగులు
సుంకరమెట్ట కాఫీ తోటల్లో నిర్మాణంలో ఉన్న కెనాపివాక్‌, వ్యూపాయింట్‌

రూ.25 లక్షలతో కెనాపివాక్‌, వ్యూపాయింట్ల నిర్మాణం

వచ్చే నెల మొదటి వారంలో అందుబాటులోకి..

పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులు

అరకులోయ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుంకరమెట్ట కాఫీ తోటల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం చిన్నపాటి వంతెన మాదిరిగా తాటిదుంగలతో కెనాపివాక్‌ను నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే కాఫీ తోటల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

అరకులోయ వచ్చే పర్యాటకులు అరకు, అనంతగిరి ఘాట్‌రోడ్డుకు ఇరువైపులా ఉండే కాఫీ తోటలను సందర్శిస్తుంటారు. బీసుపురం, సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటల వద్ద ఫొటోలు దిగుతుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సుంకరమెట్ట కాఫీ తోటల మధ్య 135 మీటర్ల పొడవున (సుమారు 450 అడుగులు) చిన్నపాటి వంతెన మాదిరిగా తాటిదుంగలతో 8 అడుగుల ఎత్తులో కెనాపివాక్‌ను నిర్మిస్తున్నారు. ఈ 135 మీటర్ల పొడవులో అక్కడక్కడ వ్యూపాయింట్లను నిర్మిస్తున్నారు. దీంతో పర్యాటకులు కాఫీ తోటలను సంపూర్ణంగా తిలకించే వీలు కలుగుతుంది. వ్యూపాయింట్స్‌ వద్ద ఫొటోలు, ఫొటో షూట్స్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. రూ.25 లక్షలతో కెనాపివాక్‌, వ్యూపాయింట్లను నిర్మిస్తున్నామని, నవంబరు మొదటి వారంలో ఇవి పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయని ఏపీఎఫ్‌డీసీ డివిజనల్‌ మేనేజర్‌ జి.కృష్ణబాబు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అదే విధంగా పాడేరు ఘాట్‌లో ఉండే కాఫీ తోటల మధ్య ఇదే తరహా నిర్మాణాలు చేపట్టేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - Oct 22 , 2024 | 11:24 PM